భారత యువ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ శ్రమ వృథా అయింది. మ్యాచ్‌ను వీక్షించిన ప్రతి క్రికెట్ అభిమానిని తన బ్యాటింగ్‌తో ఆహా అనిపించాడు. కేవలం 55 బంతుల్లో 117 పరుగులు చేసి భారత జట్టును గెలిపించినంత పని చేశాడు. కానీ, కొండంత ఛేదనలో తనకు ఎవరు సపోర్ట్ లేకపోవడంతో నిలువలేక, కొద్దిలోనే అతడి శ్రమ వృథా అయింది.
వివరాల్లోకి వెళ్తే..భారత్, ఇంగ్లాండు మధ్య మూడో టీ20 మ్యచ్ ఆదివారం నాటింగ్ హామ్లో జరిగింది. ఈ చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైయ్యింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండు.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ (77) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లియామ్ లివింగ్‌స్టోన్(29 బంతుల్లో 4 సిక్సర్లతో 42 పరుగులు నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం బ్యాంటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. విజయానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సూర్యకుమార్ అవుట్ కావడంతో భారత్ అవకాశాలను దెబ్బతీసింది. సూర్యకుమార్ కేవలం 55 బంతుల్లోనే 14 ఫోర్లు, 6 సిక్సర్లతో 117 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ (28), కెప్టెన్ రోహిత్ శర్మ (11), కోహ్లీ (11), పంత్ (1), దినేశ్ కార్తీక్ (6), రవీంద్ర జడేజా (7) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో రీస్ టాప్లే 3, డేవిడ్ విల్లీ 2, క్రిస్ జోర్డాన్ 2, గ్లీసన్ 1, మొయిన్ అలీ 1 వికెట్ తీశారు. కానీ, ఇప్పటికే సిరీస్‌ను భారత్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక ఇరుజట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జులై 12న ప్రారంభం కానుంది.