Suryakumar century in second t20
mictv telugu

సూర్యకుమార్ విధ్వంసం..భారత్ భారీ స్కోరు

November 20, 2022

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత్ భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న ‘స్కై’ న్యూజిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. సిక్సర్లు, ఫోర్లతో దంచికొట్టాడు. కేవలం 51 బంతుల్లోనే 111 పరుగులు సాధించాడు. 32 బంతుల్లో మొదటి 50 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ తర్వాత 17 బంతుల్లోనే మిగతా 50 పరుగులు చేశాడు. సూర్యకుమార్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు ఉండడం విశేషం. చివరి ఓవర్‌లో సూర్యకుమార్‌కు స్ట్రైకింగ్ రాకపోవడం,వరుస మూడు వికెట్లు కోల్పోవడం భారత్ మరికొన్ని పరుగులు చేయలేకపోయింది. లాస్ట్ ఓవర్‌లో సౌథి హ్యాట్రిక్ సాధించాడు. వరుస బంతుల్లో హార్దిక్ పాండ్య, దీపక్ హుడా,వాషింగ్టన్ సుందర్ లను వరుస బంతుల్లో పెవిలియన్ కు పంపాడు.. ఈ ఓవర్‌లో కేవలం ఐదుపరుగులే వచ్చాయి.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ వచ్చిన టీ ఇండియా ఇన్నింగ్స్‌ను ఇషాన్ కిషాన్, రిషబ్ పంత్ ప్రారంభించారు. ఓపెనర్‌గా అవతారం ఎత్తిన రిషభ్ పంత్ (6) నిరాశపరిచాడు. ఇషాన్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటిస్తూ36 పరుగులతో రాణించాడు. శ్రేయస్ అయ్యర్ 13, హార్దిక్ పాండ్య 13 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 3 వికెట్లు, ఫెర్గ్యూసన్ రెండు, సోథి ఒక వికెట్ దక్కించుకున్నారు.