న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ దక్కించుకున్న టీం ఇండియా టీ20 సిరీస్‌పై కూడా కన్నేసింది. బుధవారం సా.7 గంటలకు ప్రారంభం కాబోయే చివరి మ్యాచ్‌లో విజయం సాధించి కప్పు కొట్టేయాలని భావిస్తోంది. సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో ఓడి వెనుకబడినా రెండో టీ20లో గెలిచి టైటిల్ పోరులో నిలిచింది. లక్నో వేదికగా ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ విజయం అందుకుంది. న్యూజిలాండ్ నిర్దేశించిన 100 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19.5 ఓవర్లలో భారత్ చేధించింది. బౌలింగ్ అనుకూలించిన పిచ్‌పై సూర్యకుమార్ బాధ్యతగా ఆడుతూ మ్యాచ్‌ను ముగించాడు. తన శైలికి భిన్నంగా ఆడిన మిస్టర్ స్కై 31 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో కేవలం ఒక ఫోర్ మాత్రమే ఉండడం విశేషం.
ఆ రికార్డులపై కన్ను
టీ 20లో భారత్ తరుఫున అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. పొట్టి ఫార్మెట్‌లో దంచికొడుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే వరల్డ్ నెం.1 టీ 20 బ్యాట్స్‌మెన్‌గా అవతరించి ఆ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు మరో రికార్డుపై కన్నేశాడు సూర్య. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మలన్ పేరిట ఉన్నా రికార్డును చెరిపివేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం నెం.1 స్థానంలో ఉన్న సూర్య పాయింట్ల విషయంలో మాత్రం మలన్ తర్వాత స్థానంలో ఉన్నాడు 2020లో నెం.1 ర్యాంక్ లో ఉన్న మలన్ 915 రేటింగ్ పాయింట్లను అందుకున్నాడు. అయితే ప్రస్తుతం 908 రేటింగ్ పాయింట్లను సూర్య కలిగి ఉన్నాడు. నేడు జరగబోయే మ్యాచ్ లో మరోసారి సూర్యా భాయ్ విశ్వరూపం ప్రదర్శిస్తే మలన్ రికార్డు చెరిగిపోవడం ఖాయం.
మరో 63 పరుగులు చేస్తే…
ఇక అహ్మదాబాద్ వేదికగా జరిగే మూడో టీ20లో కూడా రాణిస్తే.. మరో అరుదైన రికార్డు బద్దలు కొట్టే అవకాశం అతని ముందు ఉంది. న్యూజిల్యాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్లలలో రోహిత్ శర్మ (511) తొలి స్థానంలో ఉంటే.. రెండో స్థానంలో ఉన్న కేఎల్ రాహుల్ (322) కొనసాగుతున్నాడు. ఇక సూర్య 260 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో కనుక అతను 63 పరుగులు చేస్తే.. న్యూజిల్యాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో అతను రెండో స్థానానికి చేరుతాడు.