మొదటి భారతీయుడిగా సంచలన రికార్డు సాధించిన సూర్యకుమార్ - MicTv.in - Telugu News
mictv telugu

మొదటి భారతీయుడిగా సంచలన రికార్డు సాధించిన సూర్యకుమార్

November 6, 2022

Suryakumar Yadav

టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో ఉన్నాడు. దేశం ఏదైనా, బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా తనదైన శైలితో పరుగులు పిండుకుంటున్నాడు. ఏడాదికాలంగా టీ20 జట్టులో ఉంటూ నిలకడగా రాణిస్తున్నాడు. ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచులో 25 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్‌‌గా నిలిచాడు. ఈ క్రమంలో కొత్త రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఫలితంగా ఆ రికార్డు సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచాడు. కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఆ రికార్డు సూర్యకుమార్ సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో వెయ్యి పరుగులు చేసిన రెండో ఆటగాడిగా, మొదటి భారత ప్లేయర్‌గా ఈ 360 డిగ్రీ ఆటగాడు అవతరించాడు.

సూర్య కన్నా ముందు పాక్ ఓపెనర్ రిజ్వాన్ ఉన్నాడు. 2021లో రిజ్వాన్ 1326 పరుగులు చేశాడు. ఇప్పుడు ఈ రికార్డును అధిగమించేలా సూర్యకుమార్ అడుగులేస్తున్నాడు. ప్రస్తుతం అతని ఖాతాలో 1026 పరుగులు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతని తర్వాత రిజ్వాన్ (924), కోహ్లీ (731)లు ఉన్నారు. అంతేకాక, ప్రస్తుత వరల్డ్ కప్‌లో మూడు అర్ధసెంచరీలతో అత్యధిక పరుగుల పరంగా 75 యావరేజ్‌తో 225 పరుగులు చేసి మూడో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో 246 పరుగులతో కోహ్లీ ఉన్నాడు. వీటితో పాటు మరో మూడు రికార్డులు సూర్య తన ఖాతాలో వేసుకున్నాడు. అవి..

1. టీ20 ప్రపంచకప్‌లో ఇండియా తరపున తక్కువ బంతుల్లో హాఫ్
సెంచరీ చేసిన జాబితాలో సూర్య మూడో స్థానంలో ఉన్నాడు. జింబాబ్వేతో మ్యాచులో 23 బంతుల్లో ఆ ఫీట్ సాధించాడు. ఈ జాబితాలో ముందుగా యువరాజ్ సింగ్ (12 బంతులు), కేఎల్ రాహుల్ (18 బంతులు) ముందున్నారు.
2. ఒక ప్రపంచకప్‌లో వంద కంటే ఎక్కువ బంతులాడి అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ప్రస్తుత ప్రపంచకప్‌లో 193.96 కలిగి ఉన్నాడు. తర్వాత మైక్ హస్సి 175.70, లూక్ రైట్ 169.29 ఉన్నారు.
3. ఇక ప్రపంచకప్‌లో టీమిండియా తరపున చివరి ఐదు ఓవర్లలో ఎక్కువ పరుగులు సాధించిన జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మొదటగా కోహ్లీ (2022లో ఆఫ్ఘాన్‌పై 63 పరుగులు), యువరాజ్ సింగ్ 2007 ప్రపంచకప్‌లో 58 పరుగులు చేసి తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కాగా, ఇప్పటికే సెమీస్‌కి చేరిన భారత్.. గురువారం ఇంగ్లండుతో మ్యాచులో తలపడనుంది.