శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా స్టార్ బ్యాటర్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. మెరుపు సెంచరీతో చెలరేగాడు. బౌండరీల లక్ష్యంగా బ్యాటింగ్ చేసిన సూర్య కేవలం 51 బంతుల్లో 7 ఫోర్లు 9 సిక్షర్లతో 112 పరుగులు చేశాడు. సూర్యకుమార్ ధాటికి శ్రీలంక బౌలర్లు తేలిపోయారు. అతడు ఆడుతున్న షాట్లకు బాల్ ఎక్కడా వేయాలో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆఫ్ సైడ్ వేసినా బౌండరీ, లెగ్ సైడ్ వేస్తే సిక్స్, ఫుల్ లెంగ్త్ బాల్స్ వేస్తే సెకెన్లలో బాల్ గ్యాలరీకి పోవడమే. క్రీజ్‌లో నాట్యమాడిన సూర్యకుమార్ విభిన్న షాట్లతో లంక బౌలర్లను భయపెట్టడంతో పాటు ప్రేక్షకులని అలరించాడు. కూర్చొని, పడుకొని, నిలబడి..ఒక్కటేంటి అన్ని భంగిమలలో షాట్లాడాడు.
రికార్డుల సెంచరీ
టీ 20లో మూడో సెంచరీ సాధించిన సూర్యకుమార్ యాదవ్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకోవడంతో పాటు మరికొన్ని బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి నాన్ ఓపెనర్‌గా సూర్య చరిత్రకెక్కాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో సూర్య.. రెండో స్థానంలో నిలిచాడు. అతనికంటే ముందు రోహిత్ శర్మ(4) ఉన్నాడు. మ్యాక్స్‌వెల్(3), కొలిన్ మున్రో(3) లతో సమానంగా ఉన్నాడు. భారత్ తరుఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన జాబితాలో సూర్య సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు. రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ బాది అగ్రస్థానంలో ఉండగా.. సూర్య 45 బంతుల్లో సెంచరీతో బాదాడు.వీరిద్దరు కూడా శ్రీలంకపైనే ఫాస్టెస్ట్ సెంచరీలు కొట్టడం విశేషం. 2023లో సూర్యకు తొలి సెంచరీ ఇదే. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచిన సూర్య.. కేఎల్ రాహుల్(2)ను వెనక్కునెట్టాడు.
భారీ విజయం
సూర్య కుమార్ విధ్వంసక సెంచరీకి తోడు బౌలర్లు రాణించడంతో 2023లో మొదటి సిరీస్‌ను టీంఇండియా కైవసం చేసుకుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా 228 పరుగుల భారీస్కోర్ సాధించింది. సూర్యతో పాటు గిల్(36 బంతుల్లో 46), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 35), అక్షర్ పటేల్(9 బంతుల్లో 21) రాణించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇషాన్ కిషాన్, హార్దిక్ పాండ్యా, హుడా ఈ మ్యాచ్‌లో నిరాశపరిచారు. ఓపెనర్ ఇషాన్ (1) మొదటి ఓవర్ లోనే ఔటవ్వగా..చివరిలో ధాటీగా ఆడే ప్రయత్నంలో హార్దిక్(4), హుడా(4) వెంటవెంటనే పెవిలియన్‌కు చేరారు. లంక బౌలర్లలో మధుశనక 2, రజిత, కరుణరత్నే, హసరంగా ఒక్కోవికెట్ దక్కించుకున్నారు.
229 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 16.4 ఓవర్లలో 137 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు 44 పరుగులతో మంచి ఆరంభాన్ని ఇచ్చిన తర్వాత వికెట్లు టపటపా రాలిపోయాయి. కుశాల్ మెండిస్(23), శనక(23) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. భారత్ బౌలర్లలో అర్షదీప్ 3, హార్దిక్ , ఉమ్రాన్, చాహల్ రెండేసి వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ ఖాతాలో ఓ వికెట్ ఉంది. చివరికి భారత్ 91 పరుగలతో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకుంది. మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు సూర్యకుమార్ యాదవ్, మ్యాన్ ఆఫ్ మ్యాచ్ సిరీస్ అవార్డు అక్షర్ పటేల్ దక్కించుకున్నారు.