suspension of etela rajender from the legislative assembly
mictv telugu

శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల సస్పెన్షన్

September 13, 2022


తెలంగాణ శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సస్పెండ్‌ చేశారు. స్పీకర్‌ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ఆయన్ను సస్పెండ్‌ చేయాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్‌ పోచారం స్పందిస్తూ ఈటలను ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెన్షన్‌కు ముందు సభలో టీఆర్ఎస్ సభ్యులు, ఈటల రాజేందర్‌ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.

సభాగౌరవాన్ని పాటించకుండా స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందున సభ నుంచి ఈటలను సస్పెండ్‌ చేయాలంటూ టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్‌ను ‘మర మనిషి’ అంటూ ఈటల సంబోధించారని.. సభకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ కోరారు. సభలో కొనసాగే అర్హత ఆయనకు లేదని మరో సభ్యుడు బాల్క సుమన్‌ అన్నారు. అనంతరం ఈటల మాట్లాడే ప్రయత్నం చేస్తుండగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలగజేసుకుని క్షమాపణలు చెప్పాకే చర్చలో పాల్గొనాలని కోరారు. క్షమాపణలు చెప్పకపోవడంతో సభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో ఈటలపై స్పీకర్ సస్పెన్షన్ విధించారు. ఈ సెషన్ ముగిసేంత వరకు సస్పెన్షన్ అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఈటలను సస్పెండ్ చేయడంపై బీజేపీ సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు.