Suzuki launches KATANA motorcycle in India
mictv telugu

అదరగొట్టే ఫీచర్లతో మార్కెట్‌లోకి సుజుకీ ‘కటానా’.. ధర ఎంతంటే..

July 4, 2022

Suzuki launches KATANA motorcycle in India

భారత మార్కెట్‌లోకి సుజుకీ ఇండియా తన కొత్త స్పోర్ట్స్‌ బైక్‌ను విడుదల చేసింది. కటానా అనే పేరుతో గ్లోబల్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఈ బైక్‌ను ఇండియాకు తీసుకొచ్చింది. సరికొత్తగా ఉన్న ఈ పేరుకు జపాన్‌కు చెందిన పురాతన కత్తి స్ఫూర్తి. దేశంలో బిగ్‌ బైక్స్‌ విభాగంలో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో భాగంగా ఈ బైక్(కటానా)ను తీసుకొచ్చినట్లు సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌ సతోషి ఉచితా తెలిపారు. గతేడాది జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఈ బైక్‌ను ప్రదర్శనకు ఉంచిన అనంతరం దీని గురించి చాలా మంది దీని కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్ చేశారని చెప్పారు. పొటెన్షియ‌ల్ క‌స్ట‌మ‌ర్ల నుంచి వ‌చ్చిన ఫీడ్‌బ్యాక్‌తో భార‌త్‌లో క‌టానాను ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యించామ‌ని చెప్పారు. భార‌త్‌లోనూ క‌టానాకు మెరుగైన ఆద‌ర‌ణ ల‌భిస్తుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.

కలర్స్:

ఈ బైక్‌ మెటాలిక్‌ మెస్టిక్‌ సిల్వర్‌, మెటాలిక్‌ స్టీలర్‌ బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో సుజుకీ ఇంటెలిజెంట్‌ రైడర్‌సిస్టమ్‌, సుజుకీ ట్రాక్షన్‌ కంట్రోల్‌ సిస్టమ్‌, సుజుకీ డ్రైవ్‌ మోడ్‌ సెలెక్టర్‌, లో ఆర్‌పీఎం అసిస్ట్‌, డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. యాక్టివ్‌, బేసిక్‌, కంఫర్ట్‌ అంటూ మూడు రకాల త్రోటల్‌ కంట్రోల్స్‌ ఉంటాయి.

డిజైన్:

ఇక క‌టానా డిజైన్ ఫీచ‌ర్ల విష‌యానికి వ‌స్తే యూనిక్ రెక్టాంగ్యుల‌ర్ షేప్‌తో కూడిన ఎల్ఈడీ హెడ్‌లైట్లు, ఎల్ఈడీ ఫ్రంట్ పొజిష‌న్ లైట్స్ క‌టానాకు స్టైలిష్ లుక్ తీసుకువ‌చ్చాయి. వెనుక భాగంలో ఎల్ఈడీ టెయిల్ లైట్‌, బ్రేక్ లైట్ స్ట‌న్నింగ్ డిజైన్‌ను తీసుకువ‌చ్చాయి. సామ‌ర్ధ్యం, సదుపాయాల‌తో రాజీ ప‌డ‌కుండానే ఈ ఫీచ‌ర్ల‌ను జోడించ‌డంతో క‌టానా ఇత‌ర బైక్‌ల కంటే భిన్నంగా క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకోనుంది.

ధర:

దీని ధరను కంపెనీ రూ.13.61 లక్షలు (ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఇందులో 999 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ డీఓహెచ్‌సీ ఇన్‌లైన్‌ ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 152 పీఎస్‌ పవర్‌ను, 106 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిక్స్‌ గేర్‌ బాక్స్‌ అమర్చారు. భారత్‌లో విడుదలైన బీఎండబ్ల్యూ ఎఫ్‌ 900 ఎక్స్‌ఆర్‌, కవాస్కీ నింజా1000 ఎస్‌ఎక్స్‌కు ఈ బైక్‌ పోటీ ఇవ్వనుంది.