నిత్యానంద ఆశీర్వాదంతో 3 అంగుళాల పెరుగుదల - MicTv.in - Telugu News
mictv telugu

నిత్యానంద ఆశీర్వాదంతో 3 అంగుళాల పెరుగుదల

November 28, 2019

Swami’s blessing makes Amitabh ‘taller’.

టీనేజ్ దాటితే శరీర పెరుగుదల ఆగిపోతుంది అని సైన్స్ చెబుతుంది. ఏం ఎత్తు పెరిగినా టీనేజ్‌లోనే అని అందరికీ తెలిసిన విషయమే. ఆ ఏజు దాటిపోయాక కాళ్లకు క్వింటాల్ బస్తాలు కట్టుకుని వేళ్లాడినా పొడవు పెరగడం అసంభవం. కానీ ఓ వ్యక్తి మాత్రం తాను ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి కృపతో ఎత్తు పెరిగానని అంటున్నాడు. ఆయన వద్దకు వెళ్లి తాను ఎత్తు పెరగాలని కోరుకున్నాడట.. అందుకు ఆయన దీవించాడట. అంతే ఆ భక్తుడు మూడు అంగుళాల పొడవు పెరిగేశాడు. అది కూడా నిమిషాల వ్యవధిలోనే అంటే నమ్మగలరా? 

ఆ వ్యక్తి పేరు అమితాబ్ షా. తాజాగా ఈ వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో తాను నిత్యానంద స్వామి ఆశీర్వాద బలంతో మూడు అంగుళాల పొడవు పెరిగానని ఘంటాపథంగా చెప్పాడు. ఈ వీడియోలో.. ‘నేను గతంలో కాస్త పొట్టిగా కనిపించేవాడిని. నా పొట్టిదనాన్ని చూసుకుని బాధపడేవాడిని. ఓరోజు నిత్యానంద స్వామి వద్దకు వెళ్లాను. ఆయన చెప్పిన ఒక అనుష్టానం ద్వారా కొద్ది నిముషాల్లోనే నేను పొడవు పెరిగాను’ అని అమితాబ్ షా తెలిపాడు. తరువాత పక్కనే ఉన్న అతని భార్య రష్మి కూడా భర్త మాటలకు వంత పాడింది. భర్త పెరిగిన హైట్‌ను కొలిచి చూపించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నా భర్త రెండు అంగుళాల పొడవు పెరగాలనుకుంటున్నానని స్వామిని కోరుకున్నారు. ‘మహా సదాశివోహం’లో పాల్గొన్న తరువాత మా ఆయన పొడవు పెరిగారు’ అని ఆమె తెలిపారు. అయితే ఈ వీడియో చూసినవాళ్లంతా నమ్మశక్యంగా లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇది అసంభవం అంటున్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి విషయం లేని ప్రగల్భాల వీడియోలు ఎక్కువ అయ్యాయి అని అంటున్నారు.