బాలీవుడ్ నటి స్వరాభాస్కర్ ఇటీవల సమాజ్ వాదీ పార్టీ నేత, ముస్లిం అయిన ఫహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి వివాహంపై కొన్ని మత వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొంత మంది ముస్లిం మతపెద్దలు ఈ వివాహాన్ని తప్పుబట్టారు. ఇదిలా ఉంటే హిందూ నేతలు కూడా స్వరా తీరును విమర్శిస్తున్నారు. తాజాగా వీరి వివాహం గురించి విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచీ కీలక వ్యాఖ్యలు చేశారు.
స్వరాభాస్కర్ హిందూ మతానికి వ్యతిరేకి అని.. ఆమె తన మతానికి చెందిన వారిని కాదని పెళ్లి చేసుకుంటుందని అనుకున్నానని.. ఇప్పుడు అదే జరిగిందని సాధ్వీ ప్రాచీ అన్నారు. శ్రద్ధా వాకర్‌ను ముస్లిం వ్యక్తి అయిన ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా చంపి, 35 ముక్కలుగా చేసి ఫ్రిజ్ లో పెట్టాడని.. స్వరా భాస్కర్‌కు కూడా ఇదే గతి పట్టవచ్చని అన్నారు. శ్రద్ధా వాకర్ విషయాన్ని స్వరాభాస్కర్ పట్టించుకోలేదని.. పెళ్లి వంటి పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఫ్రిజ్ చూసి ఉండాల్సిందంటూ వ్యాఖ్యానించారు. పెళ్లి ఆమె వ్యక్తిగతం, నేను పెద్దగా చెప్పడానికి ఏం లేదు, కానీ శ్రద్ధకు జరిగిందే స్వరాకు జరగవచ్చని సాధ్వీ ప్రాచీ అన్నారు.
ఇదిలా ఉంటే స్వరా భాస్కర్, ఫహాద్ ను పెళ్లి చేసుకోవడం లీగల్ కావచ్చు, కానీ ఇస్లామిక్ కాదని చికాగోకు చెందిన ఓ ఇస్లామిక్ పండితుడు వ్యాఖ్యానించాడు. విగ్రహారాధన చేసే స్త్రీలను పెళ్లి చేసుకోకూడదని ఖురాన్ చెబుతోందని.. ఒక వేళ పెళ్లి కోసమే స్వరా భాస్కర్ ఇస్లాంలోకి చేరితే దాన్ని అల్లా అంగీకరించడని వ్యాఖ్యానించాడు. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ మాట్లాడుతూ స్వరా భాస్కర్ ఇస్లాంను అంగీకరించకుండా ఫహద్‌ను వివాహం చేసుకోలేరని అన్నారు.