స్వర్ణ ప్యాలెస్ కేసు.. ముగ్గురి అరెస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

స్వర్ణ ప్యాలెస్ కేసు.. ముగ్గురి అరెస్ట్

August 10, 2020

Swarna Palace case.. Three arrested.

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ అగ్ని ప్రమాద ఘటనలో పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. రమేష్‌ ఆసుపత్రి చీఫ్‌ ఆపరేటర్‌ రాజా గోపాల్‌రావు, జీఎం సుదర్శన్‌, నైట్‌ షిఫ్ట్‌ మేనేజర్‌ వెంకటేష్‌లను సోమవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. స్వర్ణ ప్యాలెస్‌తో రమేష్‌ ఆసుపత్రి ఒప్పంద పత్రాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా జాయింట్ కలెక్టర్ శివశంకర్ కమిటీ సభ్యులు స్వర్ణ ప్యాలెస్‌ను పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై ఓ అంచనాకు వచ్చామని.. మరో రెండు రోజుల్లో నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని శివశంకర్‌ వెల్లడించారు. 

మరోవైపు అగ్నిప్రమాదంపై రాష్ట్ర స్థాయిలో మరో రెండు కమిటీలను కూడా ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో రమేష్ ఆసుపత్రికి అనుబంధంగా తీసుకున్న హోటల్ స్వర్ణ హైట్స్, స్వర్ణా ప్యాలెస్‌లో మరో బృందం తనిఖీలు చేస్తోంది. ఆసుపత్రిలో కరోనా పేషెంట్లకు తీసుకుంటున్న ప్రమాణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌కు గల కారణాలపై ఈ బృందం తనిఖీలు చేపట్టింది. మూడవ బృందం ఫైర్ సేఫ్టీ నామ్స్ ఏ విధంగా ఉన్నాయన్నదానిపై పరిశీలిస్తోంది. ఈ మూడు బృందాలు, అగ్నిప్రమాద ఘటనపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి. కాగా, హోటల్ స్వర్ణప్యాలెస్‌ను రమేష్ ఆసుపత్రి కోవిడ్ కేర్ సెంటర్‌గా వినియోగిస్తోంది. ఈ భవనంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దట్టమైన పొగలు అలుముకోవడంతో కరోనా బాధితులు అతలాకుతలం అయ్యారు. ఊపిరాడక అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై మూడు బృందాలు 48 గంటల్లో నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.