Sweet talk to guest faculty..Release of 10 months renewal
mictv telugu

ఏపీ: గెస్ట్ ఫ్యాకల్టీకి తీపికబురు..10 నెలల రెన్యువల్ విడుదల 

September 9, 2022

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆయా ప్రభుత్వ  జూనియర్ కళాశాలలో 8 ఏళ్లుగా పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది.  10 నెలల రెన్యువల్ విడుదల చేస్తూ, గురువారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం 1,074 మంది గెస్ట్ ఫ్యాకల్టీలకు ఉరట లభించింది.

”ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 8 ఏళ్లుగా పని చేస్తున్న మొత్తం 1,074 మంది గెస్ట్ ఫ్యాకల్టీలకు 2022-23 సంవత్సరానికి గాను 10 నెలలు రెన్యువల్ చేశాం. గత ప్రభుత్వం నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో కేవలం 3 నుంచి 5 నెలలకు గంటల ప్రాతిపదికన పీరియడుకు రూ.150 చొప్పున మాత్రమే ఇచ్చేవారు. అంటే నెలకు గరిష్టంగా రూ.10,000 మాత్రమే. అది కూడా కళాశాల ఎక్యుములేషన్ ఫండ్ ఆధారంగా వేతనం చెల్లించేలా ప్రొసీడింగ్స్ ఇచ్చేవారు. ఎక్యుములేషన్ ఫండ్ లేని కారణంతో 2017-18, 2018–19, 2019– 2020 సంవత్సరాలకు మూడేళ్లపాటు 87 కళాశాలల్లో లెక్చరర్లు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లెక్చర్లర కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రెన్యువల్ కాలాన్ని పెంచింది. దాంతోపాటే ఎక్యుములేషన్ ఫండ్‌తో సంబంధం లేకుండా వేతనాలను విడుదల చేసింది” అని విద్యాశాఖ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు.

10 నెలల రెన్యువల్‌ను విడుదల చేయటంపై జగన్ మోహన్ రెడ్డికి, సహకరించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ఆయా ప్రభుత్వ కాలేజీల్లో లెక్చర్లరుగా విధులు నిర్వహిస్తున్నవారు ధన్యవాదాలు తెలిపారు. ఇన్ని రోజులుకు తమకు న్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రికి, విద్యా శాఖ మంత్రికి కృతజ్ణతలు తెలియజేశారు.