ఇప్పుడు మనదేశం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్ తీవ్రమైంది. పూర్తి చికిత్స లేదని ఈ జబ్బుకు ప్రజలు అందుబాటులో ఉన్న మందులు వాడుతున్నారు. మరికొందరు తమకు డయాబెటిస్ రాకూడదని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు బరువు తగ్గాలని పాట్లు పడుతున్నారు.
దీని కోసం చాలామంది కేలరీ కలిగిన కృత్రిమ తీపిని అంటే.. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ విస్తృతంగా వాడుతున్నారు. అయితే ఏ లక్ష్యంతో వాటిని ఉపయోగిస్తున్నారో అది నెరవేరడం లేదని తాజా అధ్యయనంలో తేలింది. ఈ కృత్రిమ తీపిని ఉపయోగించే వారికి వారికి టైప్-2 మధుమేహం వచ్చే అవకాశముందని దక్షిణ ఆస్ట్రేలియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో వెల్లడైంది.
పరిశోధనలో భాగంగా కృత్రిమ తీపిని వాడే 5,158 మంది ఆరోగ్య ఫలితాలను ఏడేళ్ల పాటు విశ్లేషించారు. కృత్రిమ తీపి ప్రభావంతో శరీరంలోని హానిచేయని బ్యాక్టీరియా స్వరూప స్వభావాల్లో మార్పులు జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ప్రభావంతో టైప్-2 మధుమేహం వచ్చే అవకాశముందని తెలిపారు. అలాగే అధిక బరువు ముప్పు కూడా ఉంటుందన్నారు. అంతేకాదు, స్వీటనర్కు అలవాటు పడిన వృద్ధుల్లో జ్ఞాపకశక్తి తగ్గడం, గుండెపోటు, పక్షవాతం ముప్పు వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనంలో తేలినట్టు వెల్లడించారు. ఈ ప్రతికూల ప్రభావాలు ఎందుకు ఎదురవుతున్నాయనే దానిపై ప్రస్తుతానికి స్పష్టత రాలేదన్నారు.