తెలంగాణ నిరుద్యోగులకు బుధవారం వరాలిస్తామని వనపర్తి సభలో మంగళవారం సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ అసెంబ్లీకి అరగంట ముందుగానే చేరుకున్నారు. కాగా ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. సభ ప్రారంభం కాగానే నేరుగా బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. మరోవైపు అసెంబ్లీలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. రైతు ఆత్మహత్యలు, రుణమాఫీ, ధాన్యం కొనుగోలు.. ఇతర రైతుల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చింది.
ఇంతకీ కేసీఆర్ ఏం చెబుతారు.? ఉద్యోగాల ప్రకటన ఉంటుందా? నిరుద్యోగ భృతి ఉంటుందా.? లేదంటే ఏ శాఖలో ఎన్ని ఖాళీలో ఉన్నాయో చెప్పి…అన్ని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటిస్తారా? ఆ ఖాళీల భర్తీ పోను ఇంకా నిరుద్యోగ యువత ఉంటే.. వాళ్లకు భృతి కల్పిస్తామంటారా? ఏం చెప్పబోతున్నారు. పాలసీలో ఏం చెయ్యబోతున్నారు. తెలంగాణ యువత యావత్తూ చాలా ఆశగా ఎదురుచూస్తున్న సమయం ఇది. బుధవారం ఉదయం 10గంటలకు ఇంకా కొద్ది నిమిషాలే ఉంది.