ఢిల్లీలో కొత్త సంవత్సర వేడుకలు జరుగుతున్న వేళ అంజలి అనే యువతిని ఓ కారు ఢీకొట్టి లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఈ అమానుష ఘటనలో అంజలి శరీరం ఛిద్రమైపోయింది. దీంతో నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. ఆ విషాదం గురించి మరవక ముందే జనవరి 1న యూపీలో జరిగిన అలాంటి ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఢిల్లీ నగర సమీపంలో ఉండే నోయిడాలోని సెక్టార్ 14లో జరిగింది. స్విగ్గీ ఏజెంట్‌గా పనిచేసే కౌశల్ అనే యువకుడు ఓ ఫ్లైవర్ దగ్గర డెలివరీ కోసం వెళ్తుండగా, వేగంగా దూసుకొచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌తో పాటు కౌశల్ కింద పడిపోగా కారు ఆగకుండా అలాగే ముందుకు వెళ్లిపోయింది. కారు కింద ఉన్న కౌశల్‌ని అలాగే అర కిలోమీటర్ దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అనుమానం వచ్చిన డ్రైవర్ కారు ఆపి చూడగా కౌశల్ మృతదేహం కనిపించడంతో భయంతో పారిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న డ్రైవరు కోసం గాలిస్తున్నారు.