30 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేస్తామంటూ ప్రామిస్ చేసిన స్విగ్గీ విఫలైమంది. అంతేకాక క్యాన్సిల్ చేసిన ఆర్డర్‌పై ఎలాంటి కారణాలు చెప్పకుండానే రీఫండ్ మొత్తాన్ని కూడా పూర్తిగా ఇవ్వకుండా.. కట్ చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ కస్టమర్.. వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్‌లో స్విగ్గీపై కేసు వేశాడు. దీంతో స్విగ్గీ పెనాల్టీని కట్టాల్సిన పరిస్థితి నెలకొంది.
2019 డిసెంబర్ 7న పంజాబ్‌లోని బతిందా నగరానికి చెందిన మోహిత్ గుప్తా అనే వ్యక్తి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ విలువ జీఎస్టీ, డెలివరీ ఛార్జీలతో కలిపి రూ.248గా ఉంది. మోహిత్ గుప్తా రూ.148ను ఆన్లైన్లో చెల్లించాడు. మిగతా రూ.100 ఆయనకు డిస్కౌంట్ లభించింది. అయితే 30 నిమిషాల్లో డెలివరీ చేస్తామన్న స్విగ్గీ మాత్రం తన ఆర్డర్‌ను అందించలేకపోయింది. దీంతో అతడు ఆ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేశాడు. ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు కంపెనీ కేవలం అతనికి రూ.74 మాత్రమే రీఫండ్ ఇచ్చింది. ఎలాంటి కారణాలు లేకుండానే స్విగ్గీ తన క్లయింట్ నుంచి మిగతా మొత్తాన్ని డిడక్ట్ చేసిందని మోహిత్ గుప్తా.. కమిషన్‌కు తెలిపారు.
అయితే మోహిత్ గుప్తా డెలివరీ పార్టనర్ ఫోన్ కాల్స్‌కి రెస్పాండ్ కాకపోవడం వల్లే ఆర్డర్‌ను క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందని స్విగ్గీ తెలిపింది. స్విగ్గీ చెప్పిన ఈ కారణాలను కమిషన్ కొట్టిపారేసింది. ఒకవేళ స్విగ్గీ ఏదైనా రెస్టారెంట్ లేదా పికప్ లేదా డెలివరీ పార్టనర్‌తో కాంటాక్ట్ అయితే.. ఆ పనిని పూర్తి చేయాల్సిన బాధ్యత స్విగ్గీదేనని, కస్టమర్‌కి సరియైన సర్వీసును అందజేయాలని కమిషన్ పేర్కొంది. ఈ విషయంలో కమిషన్ స్విగ్గీ ధోరణిని తప్పుపట్టింది. స్విగ్గీ తప్పు ఉన్న కారణంతో.. రూ.11 వేల పెనాల్టీని విధించింది. దీంతో రూ.248ల ఫుడ్ ఆర్డర్‌కి.. స్విగ్గీ రూ.11 వేల పెనాల్టీని భరించాల్సిన పరిస్థితి నెలకొంది.