మందుబాబుల కోసం స్విగ్గీ మరో బాధ్యత.. మద్యం డెలివరీకి సిద్ధం
మందుబాబుల కోసం ఆన్‌లైన్‌లో ఆహారాన్ని సరఫరా చేసే స్విగ్గీ మరో బాధ్యతను నెత్తిన వేసుకుంది. మద్యాన్ని వినియోగదారుల ఇంటికే అందించే సదుపాయాన్ని నేటి నుంచి ప్రారంభించింది. ఇది మందుబాబులకు శుభవార్తే. లాక్‌డౌన్ నిబంధనలు పాటించడం లేదని వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో.. పాపం మందుబాబులను ఎందుకు బదనాము చెయ్యాలా అని స్విగ్గీ భావించినట్టుంది. అందుకే ఆన్‌లైన్‌లో మద్యాన్ని ఇంటికే సరఫరా చేయడానికి సిద్ధం అయింది. ఈ సేవలు ఝార్ఖండ్‌లోని రాంచితో ప్రారంభమయ్యాయని స్విగ్గీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ రాష్ట్రంలోని మరిన్ని పట్టణాలకు కూడా ఓ వారంలోగా తమ సేవలను విస్తరిస్తామని స్విగ్గీ తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోనూ తమ సేవలను విస్తరించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని సంస్థ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
ఈ విషయమై సంస్థ అధికారులు మాట్లాడుతూ.. ‘మా కంపెనీ యాప్‌లో ‘వైన్ షాప్స్’ విభాగంలో ఆన్‌లైన్ మద్య సరఫరా సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, వినియోగదారుల ఇంటి వద్దకే మద్యాన్ని డెలివరీ చేస్తాం. ఇందుకు గాను మేము లైసెన్సు, అవసరమైన ఇతర అనుమతులు కలిగిన స్థానిక దుకాణాలతో ఒప్పందాలు చేస్తున్నాం. లాక్‌డౌన్, కరోనా వైరస్ నిబంధనలను మేము పాటిస్తాం. వినియోగదారుడి చిరునామా, వయస్సు తదితర వివరాలు నిర్ధారించుకున్న అనంతరం మాత్రమే వారికి మద్యాన్ని అందజేస్తాం. ఈ విధంగా నిబంధనలకు లోబడి హోం డెలివరీ సేవలు అందించడంతో రిటైల్ మద్యం దుకాణాలకు కూడా అదనపు వ్యాపారాన్ని అందించినట్టు అవుతుంది. అంతేకాకుండా మాస్కులు, సామాజిక దూరం వంటి నిబంధనలు పాటించకుండా ప్రజలు గుమిగూడాటాన్ని కూడా అరికట్టవచ్చు’ అని అధికారుల వెల్లడించారు. కాగా, లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా మద్యం దుకాణాలు తెరిచాక మద్యం వరదలా అమ్ముడుపోయింది. అయితే ఈ వారం హైదరాబాద్‌లో మద్యం అమ్మకాలు బాగా తగ్గిపోయాయని మద్యం వ్యాపారులు వాపోతున్నారు. ఈ క్రమంలో స్విగ్గీ నిర్ణయం వారికి ఊరట కలిగించవచ్చు.