స్విగ్గీలో 3 లక్షల ఉద్యోగాలు - MicTv.in - Telugu News
mictv telugu

స్విగ్గీలో 3 లక్షల ఉద్యోగాలు

October 20, 2019

Swiggy ..

నిరుద్యోగ యువతకు ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఓ శుభవార్త చెప్పింది. తన ఉద్యోగులను 5 లక్షలకు పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న 18 నెలల్లో 3 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని భావిస్తోంది. ఇది వాస్తవరూపం దాలిస్తే దేశంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న మూడవ అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థగా పేరు గడిస్తుంది. 

గిగాబైట్స్ అనే వార్షిక టెక్ కాన్ఫరెన్స్‌లో స్విగ్గీ సహా వ్యవస్థాపకుడు, సీఈఓ మెజెటీ శ్రీహర్ష ఈ విషయాన్ని వెల్లడించారు. ‘రానున్న పది పదిహేనేళ్లలో వంద మిలియన్ల మంది కస్టమర్లు ప్రతి నెల 15 రెట్లు తమ ప్లాట్ ఫాంపై లావాదేవీలు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చదువుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తూ ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆర్జించేలా స్విగ్గీ అవకాశం కల్పిస్తోంది. ఆర్డర్ చేసిన నిమిషాల్లోనే డెలివరీ చేస్తుండటంతో స్విగ్గీకి రోజురోజుకు వినియోగదారుల సంఖ్య పెరుగుతోంది. తమ వృద్ధి అంచనాలు ఇలాగే కొనసాగితే.. ఆర్మీ, రైల్వేల తర్వాత దేశంలో మూడవ అతిపెద్ద ఉపాధి వనరుగా స్విగ్గీ మారుతుంది. ప్రత్యర్థులకు ధీటుగా వినియోగదారులకు సేవలు అందించడమే మా లక్ష్యం’ అని శ్రీహర్ష తెలిపారు.