Swiss pharma company gives Rs 16-crore drug free to save 23-month-old Hyderabad baby
mictv telugu

లాటరీలో రూ.16 కోట్ల ఇంజక్షన్.. దక్కిన చిన్నారి ప్రాణం

August 8, 2022

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారికి లాటరీ రూపంలో అదృష్టం వరించింది. సమయానికి రూ.16 కోట్ల విలువ చేసే ఇంజక్షన్ అందడంతో పాప ప్రాణాలు నిలబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్, స్టెల్లా దంపతుల కూతురు ఎల్లెన్. 23 నెలల ఆ చిన్నారికి “స్పైనల్‌ మస్క్యులర్‌ అట్రాఫీ టైప్‌-1” అనే అరుదైన వ్యాధి సోకింది. ఎదిగేప్పుడు కాళ్లు, చేతులు ఆడించలేకపోవడం.. మెడ నిలబెట్టలేకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. మేనరికం, దగ్గరి బంధుత్వం ఉన్న వారి సంతానానికి ఈ వ్యాధి వచ్చే అవకాశాలెక్కువని, రెండేళ్లవయసు లోపు చికిత్స అందించకపోతే ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్లు తెలిపారు.

కానీ అంత ఆర్థిక స్తోమతలేక బిడ్డను ఎలా బ్రతికించుకోవాలో తెలియక పాప తల్లిదండ్రులు కుమిలిపోయారు. చివరికి స్విట్జర్లాండ్‌కు చెందిన నోవార్టిస్ ఔషధ కంపెనీ దాతృత్వంతో ఉచితంగా ఆ చిన్నారికి ఇంజక్షన్‌ను అందించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఈ ఇంజక్షన్‌ను నెలకో దేశానికి ఉచితంగా ఇస్తుంది. ఈ విషయం తెలిసిన పాప తల్లిదండ్రులు సంస్థ వద్ద రిజిస్టర్ చేయించుకున్నారు. అదృష్టం కొద్దీ లాటరీలో ఈ పాపకు ఇంజక్షన్ వచ్చింది. దీంతో చిన్నారికి పునర్జన్మ లభించినట్లయింది. సికింద్రాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో చిన్నారికి చికిత్స అందించారు. క్రమంగా కోలుకుంటుండటంతో తాజాగా చిన్నారిని డిశ్ఛార్జి చేసి ఇంటికి పంపించారు. రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఉచితంగా రావడంతో దీని కోసం కృషి చేసిన అందరికి పాప తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.