రియల్ సైరా ‘భారతమాతకీ జై’ అన్నాడా? ఇంగ్లిష్ మాట్లాడాడా? చరిత్రను బాక్సాఫీస్‌కు అనుకూలంగా మార్చితే ఎలా? - MicTv.in - Telugu News
mictv telugu

రియల్ సైరా ‘భారతమాతకీ జై’ అన్నాడా? ఇంగ్లిష్ మాట్లాడాడా? చరిత్రను బాక్సాఫీస్‌కు అనుకూలంగా మార్చితే ఎలా?

September 18, 2019

చరిత్ర చరిత్రే. దానికి మనం ఎన్ని హోలీ రంగులు పూసినా సత్యం అనే జడివానలో వెలిసిపోతుంటాయి. ఈ సత్యాన్ని గ్రహించలేని సినీజనం చరిత్రను బాక్సాఫీసుకు అనుకూలంగా మార్చేస్తుంటారు. చరిత్రను ఉన్నదున్నట్లు చెప్పడానికి డాక్యుమెంటరీ తీసుకోవాలిగాని  సినిమా తీయాల్సిన పనేం లేకపోయినా ఒక చారిత్రక వ్యక్తిని, అతని పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకుని తీసే చిత్రంలో తప్పకుండా చరిత్ర దాని హద్దుపద్దుల్లో చరిత్రలాగే ఉండాలి. కొన్ని పాత్రలు, కొన్ని సన్నివేశాల విషయంలో స్వేచ్ఛ తీసుకున్నా కాలస్పృహ తప్పక ఉండాలి. ముఖ్యంగా ప్రధాన పాత్ర దాని టైమ్ అండ్ స్పేస్‌లో నడవాలి. లేకపోతే అపహాస్యం అవుతుంది. 

tt

ఈరోజు విడులైన ‘సైరా’ చిత్రం ట్రైలర్‌ను బట్టి చూస్తే అందులో ‘కాలస్పృహ’ను ఏమాత్రం పట్టించుకోలేదని అర్థమవుతుంది. ‘భారతమాతకీ జై’ నినాదంతో మొదలయ్యే ఈ ట్రైలర్ దేశభక్తిని ప్రేరేపిస్తూ సాగుతుంది. బ్రిటిష్ వారికి కప్పం కట్టే ప్రసక్తే లేదని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి తేల్చి చెబుతాడు. ఉరికొయ్యకు వేలాడుతూ ‘భారతమాతకీ జై’ అని నినదిస్తున్నాడు. మెగాస్టార్ నటన, సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభ, ఇతర నటుల సత్తా, సాంకేతిక నిపుణుల కష్టం కలగలసి ‘సైరా’ను నిర్మాణపరంగా అత్యున్నత ప్రమాణాలతో తీసినట్లు కనిపిస్తోంది. అయితే పంటికింద రాయిలా ట్రైలర్ లోనే సైరాకు ఏమాత్రం సంబంధం లేని ‘భరతమాత’ను తీసుకొచ్చి చరిత్రను పక్కగా పక్కదారి తప్పించారు. అంతటితో ఊరుకోకుండా సైరాకు ఇంగ్లిష్ భాష కూడ నేర్పి ‘గెటౌట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్’ అని కూడా అనిపించారు. 

tt

ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిష్ పాలకులు 1847లో ఉరితీశారు. అతని పోరాటం ఎందుకో అందరికీ తెలిసిందే. తనకు రావాల్సిన పింఛను డబ్బులు బ్రిటిష్ పాలకులు ఇవ్వకపోవడంతో ఆయన తిరగబడ్డాడు. సూక్ష్మదృష్టితో చూసినప్పుడు అతనిది వ్యక్తిగత పోరాటమే అయినా సారాంశంలో అది పరాయిపాలకులపై తిరుగుబాటే. స్వతంత్ర్యాన్ని కాపాడుకోవాలన్న ఒక పాలెగాని అభిమానం, అభిజాత్యమే. సైరానే కాదు, అతని  సమకాలిక భారతీయ పాలకులు చేసిన పోరాటాలు, తొలి భారత స్వతంత్ర సంగ్రామమైన 1857 తిరుగుబాటులో పాల్గొన్న దేశీ రాజుల పోరాటం కూడా అంతే. తమ ప్రాంతంపై తమకే హక్కు ఉండాలని, విదేశీ పాలకుల పెత్తనాన్ని సహించలేది లేదని వారు తిరగబడ్డారు. ఇది పైకి వ్యక్తిగత, ప్రాంతీయ ప్రయోజనాలు కాపాడుకోడానికి చేసిన యుద్ధంగా కనిపించినా సారాంశంలో స్వతంత్ర పోరాటమే. కానీ చిత్రంగా వీరికెవరికీ ‘భరతమాత’ తెలియదు. 

r

భరతమాత ప్రసక్తి లేకుండానే.. 

మరి వీరికంటే పదేళ్ల ముందు పోరాడిన సైరాకు ‘భరతమాత’ ఎలా తెలుసు? సినిమా కాబట్టి తెలిసేట్లు చేశారు. చరిత్ర ప్రకారం భరతమాత అనే భావన సైరాకు తెలిసే అవకాశం లేనేలేదు. భరతమాత భావన ఆయన చనిపోయాక పాతికేళ్లకు గానీ తెరపైకి రాలేదు. ప్రచారం లోకి, ఒక రూపంలోకి రావడానికి మరో పాతికేళ్లు పట్టింది. 

rr

చరిత్రలో

‘భరతఖండే జంబూ ద్వీపే..’ అని సాగే హిందూ మంత్రాల్లో మనదేశ స్వరూపాన్ని అభివర్ణించారు. శకుంతల, దుష్యంతుల కొడుకు భరతుడి పేరుపై మన దేశానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. తర్వాత మనదేశాన్ని ఇండియా అని, హిందుస్తాన్ అని పిలిచారు. కానీ ఎక్కడా భరతమాత ప్రసక్తి లేదు. రామాయణంలో రాముడి నోట పలికించిన ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అన్న శ్లోకంలోనూ జన్మభూమి తప్ప భరత మాత లేదు. భారతదేశాన్ని చరిత్రలో వేలమంది రాజులు పాలించారు. పోట్లాడుకున్నారు.  భరతఖండంలో ఉన్న వారిమంతా ఒకటే అనే భావన ఎవరిలోనూ లేదు. ముస్లిం దండయాత్రలు రాజపుత్రుల మధ్య కొంత ఐక్యత తెచ్చిన మాట నిజమే అయినా ఈస్టిండియా కంపెనీ మనదేశాన్ని కబళించేంతవరకూ దేశీ రాజుల మధ్య బోలెడు యుద్ధాలు జరిగాయి. తమదంతా ఒకే జన్మభూమి అనే భావన వారికి లేనేలేదు.. 

తొలిసారి.. 

ee

కిరణ్ చంద్ర బెనర్జీ అనే బెంగాలీ రచయిత 1870 దశకం తొలినాల్లో ‘భారత్ మాత’ పేరుతో ఒక నాటకం రాశాడు.దీన్ని 1873లో ప్రదర్శించారు. 1770ల నాటి బెంగాల్ కరువు చిత్రణతో సాగుతుందీ నాటకం. కథానాయకుడు భార్యతో కలసి అడవిలోని భరతమాత మందిరాన్ని దర్శించుకుని, బ్రిటిష్ వారిని ఓడించడం కథ. కానీ ఆ నాటకం పెద్దగా జనంలోకి వెళ్లలేదు. బంకిం చంద్ర ఛటర్జీ ప్రఖ్యాత నవల ‘ఆనంద మఠ్’(1882)లోని వందేమాతరం గీతం ప్రజల నోళ్లలో ఆడింది. బెంగాలీ చిత్రకారుడే అయిన అవనీంద్రనాథ్ ఠాగూర్ 1905లో భరతమాత చిత్రాన్ని వేశాడు. అచ్చం బెంగాలీ చీరకట్టుతో ఉండే ఆ వాటర్ కలర్ పెయింటింగ్ బెంగాలీలనే కాకుండా ఇతర ప్రాంతాల భారతీయులకు ఆమెను పరిచయం చేసి, స్వేదేశీ ఉద్యమానికి ఊపునిచ్చింది. భరతమాత రూపం తర్వాత అనేక మార్పులకు లోనవుతూ అఖండ భారత మ్యాపుపై వచ్చేసింది. సింహం, త్రిశూలం, మువ్వెన్నెల పతాకం తోడయ్యాయి. హిందువుగా మారిపోయిన ఆమె దేశ ప్రజల్లో జాతీయభావనను రేకెత్తించింది. ఇదీ చరిత్ర. 

స్వేచ్ఛ తీసుకోవద్దా? 

tt

చారిత్రక చిత్రాల్లో కథ విషయంలో స్వేచ్ఛ తీసుకోవడం కొత్తేమీ కాదు. ప్రేక్షకులకు చేరువ కావడానికి కొన్ని ఆకర్షణీయ, భావోద్వేగ మార్పుచేర్పులు అవసరమే. అయితే సైరాకు పూర్తిగా తెలియని, అతని పోరాటంతో ఏమాత్రం సంబంధంలేని భరతమాత నినాదాన్ని అతని నోట పలికించడం చరిత్రను వక్రీకరించడమే అవుతుంది. టాలీవుడ్‌లో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చారిత్రక కథలతో వచ్చిన చిత్రాల్లో జనానికి చేరువైన వాటిని వెళ్లమీద లెక్కపెట్టొచ్చు.  సూపర్ స్టార్ కృష్ణ హిట్ మూవీ… అల్లూరి సీతారామరాజు సినిమాను జనం ఆదరించిన మాటా నిజమే. కానీ అందులో సీతారామ రాజు చరిత్ర టైమ్ అండ్ స్పేస్ లోనే తిరుగుతుంది. 1923ను దాటి ముందుకు రాదు. 

చరిత్ర హీరో,దర్శకనిర్మాతల ఇష్టప్రకారం మారదు. చరిత్ర కాదు కదా అసలు ఫిక్షన్‌లోనే మార్పులను సహించలేదు తెలుగు జనం. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ దీనికి ఉదాహరణ. అదే పేరుతో వచ్చిన సినిమాలో గిరీశం గురజాడ అభిమతానికి విరుద్ధంగా బుచ్చమ్మను పెళ్లి చేసుకోడాన్ని తెలుగు ప్రేక్షకులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు.

yy

మళ్లీ సైరా విషయానికి వస్తే.. పరాయి పాలకులపై తిరుగుబాటును శక్తిమంతంగా చూపడానికి భరతమాత భావన అవసరమని దర్శక రచయితలు భావించినట్లు కనిపిస్తోంది. ఉయ్యాలవాడను అపరదేశభక్తుడిగా చూపించడానికి ఇతర అంశాలకంటే ఈ భావనే బాగా పనికొస్తుందని, ప్రజల్లోకి వెళ్తుందని ఆయనతో నినాదాలు చేయించారు.ఇది థియేటర్లో ఈలలు కేకలు వేయించడానికి పనికి రావొచ్చు. డబ్బుల వర్షం కురిపించొచ్చు. ఇదంతా చూసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆత్మ కూడా క్షోభించొచ్చు..!

-అన్వేష్

(ఈ వ్యాసంలోని అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతమైనవి. మైక్ టీవీకి వాటితో ఏకీభవించాల్సిన అవసరం లేదు)