ఈ పిల్లలు చేసిన నేరమేంటి? ప్రపంచమా సిగ్గుపడు! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పిల్లలు చేసిన నేరమేంటి? ప్రపంచమా సిగ్గుపడు!

February 28, 2018

సిరియా.. ఈ మాట గుర్తుకురాగానే రక్తపాతం, శవాలే గుర్తుకొస్తాయి. ఈ దారుణానికి ఇప్పుడు మరో విషాదం తోడై మనసున్న ప్రతి గుండెనూ పిండేస్తోంది. ముక్కుపచ్చలారని పసిపిల్లలు బాంబుదాడుల్లో విగతజీవులై పడి ఉండడం, నిలువెల్లా రక్తగాయాలతో ఆర్తనాదాలు చేస్తుండడం.. వంటి మరెన్నో బీభత్స దృశ్యాలు.. మనం జీవిస్తున్నది మానవ లోకమా? లేకపోతే ఏదైనా నరకలోకమా? అనే అనుమానాన్ని కలిగిస్తున్నాయి.

తాజాగా దేశ రాజధాని డమాస్కస్ నగరం శివారులోని గౌటా పట్టణంలో ప్రభుత్వ బలగాలు జరిపిన దాడుల్లో 700 మంది బలయ్యారు. వీరిలో అభంశుభం తెలియని 200 మంది చిన్నారులు, 110 మంది మహిళలు ఉండడం ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇళ్లు, బళ్లు, ఆస్పత్రులు నేలమట్టం అయ్యాయి. ఉగ్రవాదులపై దాడులకు వచ్చిన సర్కారీ బలగాలు విచక్షణ లేకుండా జరిపిన ఈ దాడుల్లో బాధితులు ఏ పాపమూ చేయని వారే కావడం గమనార్హం. పిల్లల మృతదేహాలు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నెటిజన్లు ఈ దారుణాలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. అభివృద్ధి, మానవత్వం, టెక్నాలజీ అని బడాయి కబుర్లు చెప్పడం మానేసి ఈ పిల్లలపై కాస్త దృష్టి పెట్టండని హితబోధ చేస్తున్నారు. ఇంత మారణహోమం జరుగుతున్నా అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు, తూతూ మంత్రం శాంతి ఒప్పందాలు, పర్యటనల పేర్లుతో కాలక్షేపం చేస్తున్న ప్రపంచ నేతల్లారా సిగ్గుపడండి అని శఠిస్తున్నారు.

తెరపడేది ఎప్పుడు?

ఏడేళ్ల సిరియా అంత్యర్యుద్ధంలో లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శాంతి శాంతి అని బోధించే ఐక్యరాజ్యసమితి మంత్రం పనిచేయడం లేదు. ఉగ్రవాదం, పాలకుడు అసద్ అధికార దాహం, ఆయుధాలు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని అమెరికా, రష్యా తదితర పాశ్చాత్యా దేశాల స్వార్థ్యం అన్నీ కలసి సిరియా ప్రజల ప్రాణం తోడేస్తున్నారు.

ఆంబోతుల పోట్లాటలో లేగదూడలు నలిగినట్లు పసిపిల్లలు ఈ అంతర్యుద్ధంలో బలైపోతున్నారు. బాంబుదుడుల, కాల్పుల్లో బిజీగా ఉన్న ఉగ్రవాదులు, ప్రభుత్వ బలగాలు, వేలు పెడుతున్న పరాయి దేశాలు.. ఎవరూ కాస్త కూడా వెనక్కడి తగ్గని నేపథ్యంలో ఈ మారణహోమానికి ముగింపు ఇప్పట్లో కనిపించదు..!