అగ్రరాజ్యల ఆటలో శవమైన సిరియా - MicTv.in - Telugu News
mictv telugu

అగ్రరాజ్యల ఆటలో శవమైన సిరియా

February 28, 2018

సిరియా అంతర్యుద్ధంలో చనిపోయిన పసిపిల్లల ఫోటోలు, వీడియోలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీశాయి. తిరుగుబాటుదారులపై సిరియా ప్రభుత్వం చేస్తున్న వైమానిక దాడుల్లో అమాయక ప్రజలు చనిపోతున్నారు. మొన్న గౌటాలో జరిగిన బాంబింగ్ లో వందలాది చిన్నారుల ప్రాణాలు పోయాయి. బషర్ అల్ అసద్ కు వ్యతిరేకంగా మొదలైన తిరుగుబాటు క్రమంగా అమెరికా, రష్యాల ఆధిపత్య పోరుగా మారింది.  

ఇంతకీ సిరియాలో ఏం జరిగింది?

ఫ్రెంచ్ పాలనలో ఉన్న సిరియాకు 1946 ఏప్రిల్ 17న స్వాతంత్ర్యం వచ్చింది. 1949లో అమెరికా అనుకూల ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ అది ఎక్కువ రోజులు నిలబడలేదు. సైన్యం తిరుగుబాటు చేసింది. కానీ ఆర్మీకి వ్యతిరేకంగా జనం ఉద్యమించడంతో మిలిటరీ పాలకులు దిగొచ్చారు. 1955లో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. 1958లో సిరియా అధ్యక్షుడు షుక్రీ అల్ ఖువ్వతికి ఈజిప్ట్ అధ్యక్షుడు నాసర్ కు మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం రెండు దేశాలు ఒక్కటయ్యాయి. యునైటెట్ అరబ్ రిపబ్లిక్ గా ఏర్పడ్డాయి. ఈ నిర్ణయాన్ని సిరియాలోని బాతిష్ట్ పార్టీ వ్యతిరేకించింది. ఆర్మీలోని సానుభూతిపరులతో కలిసి తిరుగుబాటు చేసింది. సిరియన్ అరబ్ రిపబ్లిక్ ను ఏర్పాటు చేసింది. అరబ్ సోషలిస్ట్ బాత్ పార్టీ మద్దతు ఇవ్వడంతో 1963లో సైన్యం మళ్లీ అధికారంలోకి వచ్చింది. అమీన్ హఫీజ్ అధ్యక్షుడయ్యాడు.

1966లో బాత్ పార్టీ రెండుగా చీలింది. హఫీజ్ దిగిపోయాడు. ప్రజాప్రభుత్వం ఏర్పడింది. కానీ 1967 ఈజిప్ట్, ఇజ్రాయెల్ యుద్ధంతో సిరియా రాజకీయ సమీకరణాలు ఇంకోసారి మారాయి. ఈజిప్ట్ కు మద్దతుగా సిరియన్ సైన్యం పోరాడింది. ఓడిపోయింది. గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించుకుంది. ఈ పరిణామం సిరియన్లలో అసంతృప్తికి కారణమయింది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని 1970 నవంబర్ లో రక్తపాతం లేని తిరుగుబాటుతో హఫీద్ అల్ అసద్ అధికారంలోకి వచ్చాడు. 1973 మార్చ్ లో కొత్త రాజ్యాంగాన్ని ప్రకటించిన అసద్, సిరియాను సెక్యులర్ సోషలిస్ట్ రాజ్యంగా మార్చాడు. అప్పటి నుంచి 30 ఏళ్ల పాటు హఫీజ్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన తర్వాత కొడుకు బషర్ అల్ అసద్ ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రస్తుతం ఇతనే సిరియా అధ్యక్షుడు

అంతర్యుద్ధానికి కారణాలు

సిరియా జనాభాలో సున్నీలదే మెజార్టీ. జనాభాలో 60 శాతం ఉంటారు. అయితే అధికారం మాత్రం షియా వర్గానికి చెందిన అలావైట్స్ చేతుల్లో ఉంది. సిరియన్ జనాభాలో షియాలు కేవలం 13 శాతం మాత్రమే ఉన్నారు. ప్రభుత్వం, సైన్యంలోని ఉన్నత పదవుల్లో వాళ్లే ఉన్నారు. అన్ని రంగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యం షియాలదే. దీన్ని సున్నీలు జీర్ణించుకోలేకపోయారు. పాలన, సంపదలో తమకూ వాటా ఉండాలని కోరుకున్నారు. అసద్ ప్రెసిడెంట్ అయ్యాక పోరాటాన్ని ఉధృతం చేశారు. అరబ్ ప్రపంచానికి పోరుబాటను చూపించిన ట్యునీషియా మల్లెపువ్వు విప్లవం స్పూర్తిగా ఉద్యమించారు. అసద్ కు వ్యతిరేకంగా 2011 మార్చిలో తిరుగుబాటు జెండా ఎగరేశారు. రోడ్ల మీదకు వచ్చారు. అయితే అల్లర్లు మొదలైన నెలరోజులకే డిమాండ్లను పరిష్కరించడానికి అల్ అసద్ ఒప్పుకున్నాడు. కొత్త రాజ్యాంగాన్ని తెస్తానన్నాడు. ఎన్నికలతోనే అధికారంలోకి వచ్చేలా సవరణలు చేస్తానని హామీ ఇచ్చాడు.

శాంతియుతంగా అధికార మార్పిడికి కట్టుబడి ఉన్నామనీ, రాజకీయ ఖైదీలను విడుదల చేస్తామని 2011 ఏప్రిల్ లో అల్ అసద్ ప్రకటించాడు. ప్రభుత్వోద్యోగులకు జీతాల పెంపు, పత్రికాస్వేఛ్చ, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామన్నాడు. ప్రజలు కోరినట్టుగా అదే సంవత్సరం ఏప్రిల్ 19న ఎమర్జెన్సీ ఎత్తేశాడు. ఎన్నో ఏళ్ల నుంచి పౌరసత్వం కోసం పోరాడుతున్న కుర్దు శరణార్ధుల డిమాండ్ కూ ఒకే చేప్పాడు. మెజార్టీ జనాభా అయిన సున్నీలకు రాయితీలు ప్రకటించాడు. రాజకీయ, రక్షణ, న్యాయ సంస్కరణలు మొదలుపెట్టాడు. అయినా ఆందోళనలు ఆగలేదు. ఎమర్జెన్సీ లేకపోవడంతో నిరసనలు ఎక్కువయ్యాయి. ఇది చివరికి అంతర్యుద్ధంగా మారింది. 2011 జులైలో కొందరు సైనిక అధికారులు ఫ్రీ సిరియన్ ఆర్మీ పేరుతో మిలటరీ వింగ్ ను ఏర్పాటుచేసి అసద్ కు వ్యతిరేకంగా సాయుధపోరు మొదలుపెట్టారు.

అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సున్నీలకు సౌదీ అరేబియా, ఖతర్, టర్కీ, లిబియా డబ్బు, ఆయుధ సాయం అందిస్తున్నాయి. ఆ మూడు దేశాల్లో సున్నీ వర్గం బలంగా ఉండడమే అసలు కారణం. వీటితో పాటు ఇజ్రాయెల్, అమెరికాల నుంచి  తిరుగుబాటుదారులకు ఆధునిక ఆయుధాలు అందుతున్నాయి. మానవబాంబులతో టెర్రర్ గ్రూప్ అల్ నుస్రా ఫ్రంట్ విజృంభించింది.

అసద్ కు అండగా…..

తిరుగుబాటుదారులపై పోరాడుతున్న సిరియన్ ఆర్మీకి లెబనాన్ హిజ్బొల్లా గ్రూపు, ఇరాన్, ఇరాక్ లకు చెందిన కొన్ని షియా గ్రూపులు మద్దతు ఇస్తున్నాయి. షియాలతో ఉన్న విభేదాలతో కుర్దులు కూడా కలిసొస్తారని తిరుగుబాటుదారులు భావించారు. కానీ తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి అసద్ కు కుర్దులు మద్దతు ప్రకటించారు. ఇందుకు సున్నీల ఇస్లామిక్ భావజాలంపై కుర్దులకు ఉన్న భయాలే కారణం. ఇక అసద్ ఓడిపోతే తీవ్రవాదం పెరుగుతుందన్న అనుమానంతో సిరియా క్రైస్తవులు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. అయితే మొదట్లో శాంతియుతంగా డిమాండ్లు నెరవేర్చుకోవాలనుకున్న సున్నీలు తర్వాత తమ అభిప్రాయం మార్చుకున్నారు. తుపాకీ పట్టారు. ఇందుకు అమెరికా, ఇజ్రాయెల్ లు కారణం.

సిరియా అంతర్యుద్ధంలో అమెరికా పాత్ర

సిరియా అంటే ముందు నుంచి అమెరికాకు పడదు. 1979 లో అమెరికా ప్రకటించిన ఉగ్రవాద దేశాల జాబితాలో సిరియా పేరుంది. 1986లో ఇజ్రాయెల్ విమానం పేల్చివేతలో సిరియా హ్యాండ్ ఉందని అమెరికా ఆరోపించింది. అమెరికా రాయబారిని వెనక్కి పిలిపించింది. అయితే విమానం కూల్చివేతకు కారణమైన అబూనిదల్ సంస్థను 1987లో దేశం నుంచి సిరియా బహిష్కరించింది. దీంతో అమెరికా కోపం తగ్గింది. రెండు దేశాల సంబంధాలు నార్మల్ అయ్యాయి. 1990 ఇరాక్ యుద్ధంలో అమెరికా తరపున సిరియా పాల్గొనడంతో పశ్చిమాసియాలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. లెబనాన్ లో బందీలుగా ఉన్న విదేశీయులను విడిపించడంలో అమెరికాకు సిరియా సహాయం చేసింది. ఈ సంఘటనలోతో అమెరికా మిత్రదేశంగా సిరియా మారుతుందని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే సెప్టెంబర్ 11 దాడుల తరువాత అమెరికా మొదలుపెట్టిన ఉగ్రవాదంపై పోరులోనూ సిరియా జాయిన్ అయింది. బహ్రెయిన్ లోని అమెరికా నావల్ బేస్ పై అల్ ఖైదా దాడి గురించి ముందే హెచ్చరించింది.

2002లో ఇరాక్ పై అమెరికా దాడిని సిరియా వ్యతిరేకించింది. ప్రపంచ పోలీస్ కు కోపమచ్చింది. సద్దాం అనుచరులకు సిరియా ఆశ్రయం ఇస్తోందని అమెరికా ఆరోపించింది. సిరియా సరిహద్దుల నుంచి ఇరాక్ లోకి జిహాదీలు వస్తున్నారని నెత్తీ నోరు బాదుకుంది. 2005 లో లెబనాన్ ప్రధాని హత్యతో సిరియాపై అమెరికా కోపం కట్టలు తెంచుకుంది. లెబనాన్ ప్రధాని మర్డర్ కు సిరియా కారణమన్న అనుమానంతో తన రాయబారిని వెనక్కి పిలిపించింది. అప్పటినుంచి సిరియా మెడపై కత్తి పట్టుకుని టైం కోసం ఎదురుచూసింది. అరబ్ విప్లవంతో  అమెరికాకుకాలం కలిసొచ్చింది. టర్కీ, సౌదీ అరేబియా, ఖతార్  సాయంతో తిరుగుబాటును ఎగదోసింది. ఈ మూడు దేశాల్లోని పాలకులు సున్నీల కావడంతో అమెరికా పని ఈజీ అయింది.

ఇజ్రాయెల్ కోణం

పశ్చిమాసియాలో తనకు ఎదురుఉండకూడదన్నది ఇజ్రాయెల్ విధానం. ఇందుకు ఇరాక్, ఇరాన్, సిరియాలే అడ్డు.  ఇరాక్ లో సద్దాంను చంపేసి, సిరియాను కూడా ఖతం చేస్తే ఇరాన్ కు చెక్ పెట్టొచ్చన్నది ఇజ్రాయెల్ ప్లాన్. షియాలతో జాతివైరం ఉన్న ఖతార్,టర్కీ, లిబియాల సహాయంతో ఇజ్రాయెల్ కుట్రలు మొదలుపెట్టింది. పాలస్తీనా ఉద్యమకారులకు సిరియా సహాయం చేస్తోందని ఆరోపించింది. లెబనాన్ హిజ్బోల్లా గ్రూపుకూ ఆయుధ సహాయం చేస్తోందని సిరియాపై యుద్ధానికి సై అంది. వైమానిక దాడులను కూడా జరిపింది.

అసద్  ఓడిపోతే అమెరికాకు కలిగే ప్రయోజనం ఏంటి?

గల్ఫ్ ఆయిల్ నిల్వల్లో 20 శాతం సిరియాలోనే ఉన్నాయి. అక్కడ కీలు బొమ్మ ప్రభుత్వం ఉంటేనే ఆయిల్ అమెరికా సొంతం అవుతుంది. మరోవైపు సిరియా అదుపులోకి వస్తే, ఇరాన్ కు ఈజీ చెక్ పెట్టొచ్చన్నది అమెరికా ఆలోచన. పనిలోపనిగా రష్యాను కూడా కార్నర్ చేయవచ్చు. దీంతో ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదాన్ని గుర్తుతెచ్చుకుని సిరియాపై అమెరికా యుద్ధానికి దిగింది. అయితే అమెరికా కుట్రలను అర్థం చేసుకున్న రష్యా, డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన 59 ఏళ్లకు అమెరికాతో రష్యా అమీతుమీకి దిగడం ఇదే తొలిసారి.

2011 లో సిరియాలో అమెరికా,రష్యాలు మొదలుపెట్టిన మృత్యు క్రీడ మొన్న గౌటాలో మారణహోమానికి కారణమైంది. రాజధాని డమాస్కస్ కు దగ్గర్లోనే గౌటా ఉంది. ఈ ప్రాంతం తిరుగుబాటుదారుల చేతుల్లో ఉంది. దీంతో ఎలాగైనా దాన్ని స్వాధీనం చేసుకోవాలనుకున్న సిరియా, పాశవికంగా బాంబు దాడులు చేసింది. ఇందుకు రష్యా కూడా సహాయం చేసింది. తన ఫైటర్ ప్లేన్స్ ను పంపి భీకరమైన బాంబింగ్ జరిపింది.

రష్యా ప్రెసిడెంట్ పుతిన్, సిరియా అధ్యక్షుడు అసద్ కు చనిపోతున్న పిల్లలు కనిపించడం లేదు. బతికించమని వాళ్లు చేస్తున్న ఆర్తనాదాలు కూడా వినిపించడం లేదు. అమెరికా సామ్రాజ్యవాదానికి ఎదురునిలిచి పోరాడుతున్న ఆ ఇద్దరికి, తాము కూడా రక్తం రుచిమరిగిన రాక్షసులుగా మారామన్న సంగతి తెలియకపోవడమే విషాదం.