సిరియాలో మహిళలను మేస్తున్న మానవతా కంచెలు - MicTv.in - Telugu News
mictv telugu

సిరియాలో మహిళలను మేస్తున్న మానవతా కంచెలు

February 28, 2018

‘కంచే చేను మేసినట్లు’ అని సామెత. సిరియాలో మానవతా సాయం పేరుతో మదమెక్కిన కంచెలు మహిళలను కాటేస్తున్నాయి. సిరియా అంతర్యుద్ధ బాధితుల కష్టాలు, కన్నీళ్ల గాథలో ఇదో దారుణం. ఒక ఉగ్రవాద దాడులు, మరోపక్క సైనిక దాడుల మధ్యలో నలిగిపోతున్న ప్రజలకు కాసింత బ్రెడ్డు, గ్లాసుడు పాలను ఆశ చూపి కాటేస్తున్నారు. ముక్కుపచ్చలారని చిన్నారుల నుంచి ముసలి వాళ్లవరకు అందరిపైనా ఘాతుకాలకు తెగబడుతున్నారు స్వచ్ఛంద సేవకులు.ఈ లైంగిక దాడులు కొన్నాళ్ల కిందట హైతీలో ఆక్స్‌ఫామ్ కార్యకర్తలు చేసిన దారుణాలను తలపిస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం.. సిరియాలో ఆహారం, ఔషధాలు అందిస్తున్న ఐక్యరాజ్యసమితి, రెడ్‌క్రాస్ వంటి సంస్థల  వలంటీర్లలో కొందరు అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ‘బ్రెడ్డు, పాలు ఇస్తాం. మా కోరికలు తీర్చండి. సరికి సరి’ అని వేధిస్తున్నారు.

పలువురు బాలికలను మానవతా సహాయకులు చెరబట్టారని యునైట్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక తెలిపింది. ‘కొందరు వలంటీర్లు, అధికారులు.. బాలికలను పెళ్లిళ్లు చేసుకుని కోరికలు తీర్చుకుని వదిలేస్తున్నారు. ఆహారం, మంచినీరు, బట్టలను అందిస్తామని చెప్పి ఇలా మోసగిస్తున్నారు. యుద్ధంలో సర్వస్వం కోల్పోయి, మగదిక్కులేని మహిళలను వీరు టార్గెట్ చేసుకుంటున్నారు. మానవతా సాయం పేరుతో సిరియాలో ఇలాంటి దారుణాలకు పాల్పడ్డం కొత్తేమీ కాదు. 2015లోనూ దారా, కునీత్రాల్లో ఆహారం ఆశచూపి లైంగిక దాడులు చేశారు.