క్రిస్మస్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది.. క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ, శాంటా, లైట్స్, గిఫ్ట్స్, కేక్స్. ఈ పండుగ శోభ క్రిస్మస్ స్టార్ లైట్స్, క్రిస్మస్ ట్రీ లను అలంకరించడంలోనే దాగుంది. అలా ఓ హెయిర్ స్టైలిస్ట్.. జుట్టుతో క్రిస్మస్ ట్రీని తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించాడు. మగువలకు రకరకాలుగా హెయిర్ ను స్టైల్ చేయడం హెయిర్ స్టైలిస్ట్ ల ప్రత్యేకత. పార్టీలు, శుభకార్యాలు, ఈవెంట్లు ఇలా.. ఒక్కోసారి ఒక్కోరకమైన హెయిర్ స్టైల్ లను సెట్ చేస్తుంటారు. తాజాగా ఓ ప్రఖ్యాత సిరియన్ హెయిర్ స్టైలిస్ట్ డానీ హిస్వానీ తన ప్రతిభతో ఓ మహిళ తలపై ఏకంగా క్రిస్మస్ ట్రీనే రూపొందించాడు. క్రిస్మస్ ట్రీ ఆకారంలో 2.90 మీటర్ల (9 అడుగుల 6.5 అంగుళాలు) ఎత్తులో ఓ మహిళ జుట్టును అందంగా అలంకరించి రికార్డ్ సృష్టించారు.
హిస్వాని ప్రపంచ ఫ్యాషన్ మ్యగజైన్లు, పెనెలోప్ క్రజ్, దీపిక పదుకొనె, ప్యారిస్ హిల్టన్ వంటి గొప్ప సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్‌గా పనిచేశారు. ఈ కేశాలంకరణ చేసిన విధానాన్ని తెలుపుతూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో పోస్టు చేసింది. డానీ హిస్వానీ.. ఇప్పటికే అనేక సార్లు అనేక రకాల హెయిర్ స్టైల్స్ ను రూపొందించి పలు రికార్డులను సాధించాడు. పలు ప్రపంచ మ్యగజైన్లలోనూ అతని గురించి ఆర్టికల్స్ కూడా వచ్చాయి. అతని అనుభవాన్నంతా.. జుట్టుతో క్రిస్మస్ ట్రీ తయారు చేసేందుకు ఉపయోగించాడు. బుర్రకు పదునుపెట్టి.. యువతి తలపై క్రిస్మస్ ట్రీ ఆకారంలో జట్టును అలంకరించాడు.