తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 30న విచారణకు రావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు ఇచ్చిన 41 సీఆర్పీసీ నోటీసులపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిల్ పై తెలంగాణ హైకోర్టు రేపు విచారణ చేపట్టనుంది. సీఎం కేసీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారంటూ మాదాపూర్లోని సునీల్ కనుగోలు కార్యాలయంపై పోలీసులు ఇటీవలే దాడి చేశారు. కంప్యూటర్, లాప్ టాప్లు సీజ్ చేశారు. దీనిపై ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు నోటీసులు ఇవ్వకుండా కార్యాలయాన్ని సీజ్ చేశారని పోలీసులను నిలదీశారు. ఈ కేసులో ఇప్పటికే శ్రీప్రతాప్, శశాంక్, ఇషాన్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సునీల్ కనుగోలును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చినట్టుగా పోలీసులు తెలిపారు. పోలీసులు సోదాలు నిర్వహించిన సమయంలో సునీల్ విదేశాల్లో ఉండడంతో భారత్కు తిరిగి వచ్చిన అనంతరం పోలీసులు ఆయనకు ఇటీవల సీఆర్పీసీ 41ఏ నోటీసులు జారీ చేయగా వాటిని కాంగ్రస్ తరుపున మల్లు రవి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ నోటీసులపై సునీల్ న్యాయపోరాటానికి దిగారు.