t20 -2022 world cup won by engaland
mictv telugu

విశ్వవిజేత ఇంగ్లాండ్..ఫైనల్లో పాక్ చిత్తు

November 13, 2022

టీ20 వరల్డ్‌కప్ విశ్వవిజేతగా ఇంగ్లాండ్ నిలిచింది. మెల్ బోర్న్ వేదికగా సాగిన ఫైనల్లో పాకిస్థాన్‌పై ఘనవిజయం సాధించింది. ఆలౌరౌండర్ షోతో అదరగొట్టి రెండోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. పాక్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సాధించింది. స్టోక్స్ (49 బంతుల్లో52) అర్థసెంచరీతో చెలరేగగా, కీలక సమయంలో మొయిన్ అలీ(19) బౌండరీలతో విరుచుకుపడ్డాడు. బట్లర్ 26 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో రఫ్ రెండు వికెట్లు తీయగా, షాహీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

స్వల్ప లక్ష్యమైన అయినే ఇంగ్లాండ్‌కు చేధన అంతా సులువుగా సాగలేదు. ఆదిలోనే ఆ జట్టుకు షాక్ తగిలింది. మొదటి ఓవర్‌లో హేల్స్ వెనుదిరగగా తర్వాత సాల్ట్, బట్లర్ కూడా స్వల్పవ్యవధిలో ఔటయ్యారు. ఈ సమయంలో జట్టును స్టోక్స్, బ్రూక్(20) ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తర్వాత బ్రూక్ అవుట్ కావడం.. స్కోర్ నెమ్మదించడంతో కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే క్రీజ్‌లో కుదురుకున్న స్టోక్స్..పాక్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చివరిలో తనదైన శైలిలో బౌండరీలతో విరుచుకుపడి మ్యాచ్‌ను ముగించాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్థాన్‌ను ఇంగ్లాండ్ బౌలర్లలు బెంబేలెత్తించారు. వరుస వికెట్లు తీస్తు కోలుకోకుండా చేశారు. బాబర్ ఆజామ్ (32), మసూద్ (38) తప్ప పెద్దగా ఎవరూ రాణించలేదు. సామకరణ్ వేసిన 17వ ఓవర్‌లో షాన్ మసూద్(38) ఔటవ్వడంత పాక్ తలరాత ఒక్కసారిగా మారిపోయింది. చివరిలో పాక్ బ్యాట్స్ మెన్‌లు అందరూ తేలిపోయారు. చివరి మూడు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే చేసి ఇన్నింగ్స్ 137 పరుగుల వద్ద ముగించింది పాక్. మూడు వికెట్లు తీసి పాకిస్థాన్‌ను దెబ్బతీసిన సామ్ కరణ్‌కు ’మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‘ అవార్డు దక్కింది