T20 World Cup 2022 Final: England elects to bowl, Babar Azam loses toss again
mictv telugu

T20 ఫైనల్: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్

November 13, 2022

టీ20 కొత్త ప్రపంచ ఛాంపియన్‌ ఎవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రతిష్ఠాత్మక మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా జరగనున్న టైటిల్ పోరులో ఇంగ్లండ్ జట్టుతో పాకిస్థాన్ తలపడనుంది. ఈక్రమంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇంతకుముందు టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో తలపడ్డ రెండుసార్లూ ఇంగ్లాండ్‌దే గెలుపు. ఏ జట్టు గెలిచినా రెండోసారి పొట్టి ఫార్మాట్లో ప్రపంచ ఛాంపియన్‌ అవుతుంది. 42 గ్రూప్‌ మ్యాచ్‌లు, 2 నాకౌట్‌ మ్యాచ్‌ల తర్వాత 45వ పోరులో విశ్వ విజేత ఎవరో తేలనుంది. టోర్నీలో ఇరు జట్ల ప్రయాణం చూస్తే ఫైనల్‌లో ఆసక్తికర పోరు ఖాయం అనిపిస్తోంది.

టైటిల్ పోరుకు సర్వం సిద్ధమైన వేళ… ఇరు జట్లు కూడా సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సెమీ ఫైనల్ లో ఇరు జట్లు తమ ప్రత్యర్థులను ఏకపక్షంగా ఓడించి మరీ ఫైనల్ చేరాయి. ఇరు జట్ల బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లైనప్ కూడా పటిష్టంగానే ఉన్నాయని చెప్పాలి. ఈ క్రమంలో ఇరు జట్లు సెమీస్ లో ఆడిన కూర్పుతోనే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫామ్ లేమితో కనిపించిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్… సెమీస్ లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అదే సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ కూడా తానెంత ప్రమాదకారో భారత్ తో జరిగిన సెమీస్ లో నిరూపించాడు. అన్ని విభాగాల్లో సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న పాక్, ఇంగ్లండ్ లు ఇప్పటికే ఓ దఫా టీ20 వరల్డ్ కప్ ను గెలుచుకోగా… నేటి ఫైనల్ లో ఎవరు గెలిచినా రికార్డేనని చెప్పక తప్పదు.