బీజేపీకి షాక్.. యోగి అడ్డాలో ఎస్పీ గెలుపు! - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీకి షాక్.. యోగి అడ్డాలో ఎస్పీ గెలుపు!

March 14, 2018

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు భారీ సీట్లు అందించిన ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఎదురుగాలి వీస్తోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కంచుకోటలో ములాయం జెండా ఎగురుతోంది. యోగి, డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్యలు లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన గోరఖ్ పూర్, ఫుల్పూర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ విజయ ఢంకా మోగిస్తోంది. ఆదివారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ ఈ రోజు మొదలైంది. మధ్నాహానికి ఈ స్థానాల్లో ఎస్పీ అభ్యర్థులు బీజేపీ అభ్యర్థులపై 15 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

 

11వ రౌండ్ ముగిసేటప్పటికి గోరఖ్ పూర్ లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ నిషాద్‌కు 1,64,000 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాకు 1,50,000 ఓట్ల వద్ద ఉన్నారు. ఫుల్పూర్‌లో ఎస్పీ అభ్యర్థి నరేంద్ర ప్రతాప్ సింగ్ 1,56,000 ఓట్ల వద్ద, బీజేపీ అభ్యర్థి 1,35,000 వేల ఓట్ల వద్ద కొనసాగుతున్నారు. మిగతా రౌండ్లలోనూ ఇవే ఫలితాలు వస్తాయని, ఎస్పీ గెలుపు ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఊహించని అద్భుతాలు జరిగిన గెలుపు తమనే వరిస్తుందని బీజేపీ ఆశతో ఉంది.

 గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడంతో లోక్‌సభ ఎంపీలుగా ఉన్న యోగి ఆదిత్యనాథ్(గోరఖ్ పూర్), కేశవ్ మౌర్య(ఫుల్పూర్) రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నికలు అవసరం అయ్యాయి.  47.45 శాతం పోలింగ్ నమోదైంది. ఎస్పీకి బీఎస్పీ మద్దతు ప్రకటించడంతో ఆధిక్యం సాధ్యమైంది.