మహాభారత సెట్స్ పైకి వెళ్లకముందే సెగ…
అది వంద, రెండు వందల కోట్ల సినిమా కాదు…వెయ్యికోట్ల సినిమా…టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచి షూటింగ్ పూర్తయ్యకే దాకా ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా సెన్సేషనే. రూ.1000 కోట్ల ‘మహాభారత’సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ఆటంకాలు వస్తున్నాయి. రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎం.టి వాసుదేవన్ నాయర్ రచించిన ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి మహాభారత అని పేరుపెడితే వూరుకోం అంటూ కేరళకు చెందిన హిందు ఐక్యవేదిక వార్నింగ్ ఇచ్చింది.
మహాభారత పేరు పెడితే సినిమాను విడుదల కానివ్వమంటూ సంఘం అధ్యక్షురాలు కె.పి శశికళ అంటున్నారు. ‘నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా ‘రాందమూళం’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నప్పుడు చిత్రానికి ఆ పేరే పెట్టాలి. అంతేకానీ వేద వ్యాసుడు రాసిన మహాభారతం పేరు ఎలా పెడతారు? మా మాటలుపట్టించుకోకుండా అదే పేరు పెడితే సినిమా థియేటర్లలో ఆడనివ్వం.’ అని హెచ్చరించారు.
‘రాందమూళం’ నవల పాండవుల్లో రెండోవాడైన భీముడి గురించే ఉంటుంది. యూఏఈకి చెందిన భారతీయ వ్యాపారవేత్త బి.ఆర్ శెట్టి ఈ సినిమాని రూ.1000 కోట్లతో తీస్తున్నారు. దర్శకుడు వి.ఎ. శ్రీకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో భీముడి పాత్రలో మోహల్‌లాల్ నటించనున్నారు. ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారు. 2018 సెప్టెంబర్‌లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. 2020లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.