మరో దేశం వెళ్లాలంటే మన జేబులోంచి ఖర్చు చేయాల్సిందే! అయితే తైవాన్ వెళితే వారే మనకు తిరిగి ఎంతోకొంత డబ్బిస్తారు. నమ్మబుద్ధి కావడం లేదు కదా! ఇది నిజంగా.. నిజం!!!
హాంకాంగ్ తర్వాత.. తైవాన్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడానికి నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నది. తైవాన్ ప్రభుత్వం 165 డాలర్లు అంటే రూ.13,600 చెల్లిస్తారు. 5 లక్షల మంది పర్యాటకులు 658 డాలర్లు లేదా రూ.54,500 నుంచి 90,000 టూర్ ప్యాకేజీ రూపంలో అందచేయనున్నట్లు ప్రకటించింది.
ఎలా అందుతుంది..?
తైవాన్ రవాణా మంత్రి వాంగ్ కువో-త్సాయ్.. ఈ మొత్తాన్ని డిజిటల్ గా బదిలీ చేస్తామని, దీనిద్వారా పర్యాటకులు వసతి, ప్రయాణం, ఇతర ఖర్చులపై తగ్గింపులను పొందేందుకు ఉపయోగించుకోవచ్చునని అన్నారు.
– ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎలా దరఖాస్తు చేసుకోవాలో ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.
– ప్రోత్సాహకాలను లక్కీ డ్రా ద్వారా లేదా విమానయాన సంస్థల ద్వారా పంపిణీ చేయవచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
– హాంకాంగ్ కూడా ఫిబ్రవరిలో ఇదేవిధమైన ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. అంతర్జాతీయ ప్రయాణీకులకు 5 లక్షల ఉచిత విమాన టిక్కెట్లను ఆఫర్ చేసింది.
భారతీయ పర్యాటకుల కోసం..
అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ చైనా (ఆర్ఓసీ)గా పిలువబడే తైవాన్ కు వెళ్లడానికి భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్లు ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి.
– దరఖాస్తుదారులు బస చేయడానికి ముందుగానే రౌండ్ ట్రిప్ విమాన టిక్కెట్లు, హోటల్ బుకింగ్స్, బ్యాంక్ స్టేట్ మెంట్స్, విజిటర్ వీసా విషయంలో ఆహ్వానలేఖను కూడా చూపించాలి.
– భారతీయులు పర్యాటక బృందంతో ప్రయాణిస్తే ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇది సాధారణంగా తైవానీస్ ప్రభుత్వ సంస్థలు లేదా ఎన్జీవోలు నిర్వహించే ఈవెంట్స్ కు హాజరయ్యే వ్యక్తులు అప్లయ్ చేయాల్సి ఉంటుంది.
– కెనడా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, జపాన్, న్యూజిలాండ్, యూఎస్ లేదా యూకే నుంచి చెల్లుబాటు అయ్యే శాశ్వత నివాస కార్డులు లేదా వీసాలు కలిగిన భారతీయ పాస్ పోర్ట్ హోల్డర్స్ కూడా తైవాన్ ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
తైవాన్ లో పర్యాటకం..
తైవాన్ కరోనా పాండమిక్ నుంచి తమ ఆర్థిక వ్యవస్థను తిరిగి పొందాలనుకుంటున్నది. అందులో భాగంగానే పర్యాటక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రభుత్వం 12.3 బిలియన్ యూఎస్ డాలర్లను ప్రకటించింది.
– తైవాన్ జీడీపీలో పర్యాటకం దాదాపు 4శాతం వాటాను కలిగి ఉంది.
– తైవాన్ సంస్కృతి, సహజ అద్భుతాల గొప్ప సమ్మేళనంగా చెప్పొచ్చు. పెద్ద పెద్ద భవంతులు, ప్రశాంతమైన బీచులు, చైనీస్ దేవాలయాలు ఇలా ఒక్కటేమిటి నగరం చాలా ఆహ్లాదంగా ఉంటుంది.
– ప్రతీ సంవత్సరం ఎక్కువగా జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, మకావో, ఆగ్నేయాసియా, యూరప్, అమెరికా నుంచి సందర్శకులు ఎక్కువగా వస్తారు.
– అంతర్జాతీయ ప్రయాణీకులకు ప్రధాన సమస్య.. పెరుగుతున్న విమాన ఛార్జీలు. సెలవుల్లో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి.
– తైవాన్ గోల్డ్ కార్డ్ ఉండడం వల్ల ఇండోనేషియా వంటి దేశాల్లోలాగా డిజిటల్ గా షాపింగ్ చేయడం సులభం అవుతుంది. అందుకే అక్కడి ప్రభుత్వం విదేశీయులను స్వాగతించడానికి ఈ కార్డ్ పథకాలను కూడా ప్రారంభిస్తున్నది.