ఇంట్లోంచి బయటికొచ్చాడని రూ. 24 లక్షల ఫైన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇంట్లోంచి బయటికొచ్చాడని రూ. 24 లక్షల ఫైన్

March 24, 2020

Taiwan Police Fine to Corona Quarantine men  

భారత్‌లో లాక్ డౌన్ చేసి కరోనా మహమ్మారిని అడ్డుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.. కానీ చాలా ప్రాంతాల్లో ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. రకరకాల కారణాలు చెప్పి దర్జాగా తిరుగుతున్నారు. దీంతో ఎవరు అత్యవసర పనులపై వస్తున్నారో, ఎవరి జులాయి తిరుగుళ్ల కోసం వస్తున్నారో అర్థం  కావడం లేదు. పోలీసులకు అసలే ఓపిక తక్కువ. కనిపించినోళ్లపై లాఠీ విసురుతున్నారు. కానీ తైవాన్‌లో మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించారు. ప్రభుత్వ ఆదేశాలను లెక్కచేయకుండా రోడ్డెక్కిన వారిపై చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దీంట్లో భాగంగా ఓ వ్యక్తికి ఏకంగా రూ. 24 లక్షల జరిమానా విధించారు. 

హువాంగ్ అనే 35 ఏళ్ల వ్యక్తిని సుమారు 14 రోజుల పాటు స్వీయ నిర్భందంలో ఉండాలని వైద్యులు సూచించారు. కానీ వారి సూచనలు లెక్క చేయకుండా నిబంధనలు అతిక్రమించి స్నేహితులతో కలిసి ఓ క్లబ్‌లో డ్యాన్స్ చేస్తుండగా అధికారులు గుర్తించారు. వెంటనే అతనికి రూ.24 లక్షలు జరిమానా విధించారు. క్వారంటైన్‌లో ఉన్న వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు అక్కడి పోలీసులు ఓ యాప్  వినియోగిస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానం వస్తే వారి వివరాలను సేకరించి కదలికను గమనిస్తున్నారు. ఇలాగే హువాంగ్‌ వ్యవహారంపై కూడా దృష్టిపెట్టిన పోలీసులు కొరడా ఝులిపించారు. కాగా తైవాన్‌లో ఇప్పటివరకు 195 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు.