చైనాకి షాకిచ్చిన తైవాన్.. సరిహద్దు దాటిన డ్రోన్ పేల్చివేత
చైనా - తైవాన్‌ల మధ్య వివాదం ముదురుతోంది. ఈ రెండు దేశాల మధ్య ఇప్పటికే పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండగా, చైనా రెచ్చగొట్టే చర్యలకు దిగింది. తైవాన్ ఎయిర్ స్పేస్‌లోకి ఓ సివిలియన్ డ్రోన్ పంపింది. వెంటనే పసిగట్టిన తైవాన్ మిలిటరీ దానిని పేల్చి వేసి గట్టి హెచ్చరిక పంపింది. చైనా వైపు నుంచి ఈ డ్రోన్ రావడంతో గుర్తు తెలియని డ్రోన్‌గా చెబుతున్నా అనుమానం మాత్రం డ్రాగన్ మీదే ఉంది. కాగా, ఇటీవల అమెరికా సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటన సందర్భంగా చైనా రెండు దేశాలపై మండిపడింది. కావాలని రెచ్చగొడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసింది. వన్ చైనా పాలసీకి ఆమోదం తెలిపి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఇందుకు తగిన ఫలితం అనుభవిస్తారని బెదిరించింది. అయితే వీటిని ఏమాత్రం ఖాతరు చేయని అమెరికా, తైవాన్‌లు ప్రజాస్వామ్యం కోసం ఎంతవరకైనా వెళ్తామని ప్రకటించాయి. చైనా ఏ క్షణంలోనైనా దాడికి దిగే అవకాశాలున్న నేపథ్యంలో అమెరికా తన నౌకలను తైవాన్ సముద్ర తీరంలో ఇప్పటికే మొహరించింది. దీంతో చైనా ఆచితూచి అడుగులు వేస్తోంది. అటు తైవాన్ కూడా తన మిలిటరీ సామర్థ్యాన్ని పెంచుకునే చర్యలు ప్రారంభించింది. అవసరమైతే ప్రతీ పౌరుడు యుద్ధంలో పాల్గొనేలా తగిన శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.