తాజ్ మహల్ వివాదం కీలక మలుపు తిరిగింది. పాలరాతి మందిరం నేల మాలిగలోని మూసి ఉంచిన 22 గదుల్లో ఏముందో తెలిసింది. వీటి చిత్రాలను భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) ఈ రోజు బహిర్గతం చేసింది. ఈ గదుల్లో హిందూ దేవతల విగ్రహాల్లాంటివేవీ లేవని, అవన్నీ ఖాళీగా ఉన్నాయని ఏఎస్ఐ అధికారులు తెలిపారు. ఈ అంశంపై అసత్య ప్రచారాలకు తెర దింపడానికే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
తాజ్ మహల్‌లోని 22 గదుల్లో హిందూ శాసనాలు, దేవతా విగ్రహాలు ఉన్నాయని, అందులో ఏమున్నాయో బహిర్గతం చేయాలని హిందూ సంఘాల ప్రతినిధులు సుప్రీం కోర్టుకెక్కారు. తాజ్ మహల్ ఒకప్పుడు తేజోమహాలయం అనే శివాలయమని, దాన్ని కూల్చేసి తాజ్ మహల్ కట్టారని, ఆ గదులను తెరిస్తే ఆధారాలు బయటికొస్తాయని హిందూ సంఘాలు వాదించాయి. యితే అలా ఆదేశించలేమని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో ఏఎస్ఐ ఈ గదుల ఫొటోలంటూ కొన్ని చిత్రాలను విడుదల చేసింది. కాగా తాజ్ మహల్ లోని ఈ 22 గదుల మరమ్మతుల కోసం రూ.6 లక్షలు ఖర్చు అయినట్లు అధికారులు వెల్లడించారు.