Taj Mahal Was Not Built by Shahjahan, States Plea In Supreme Court
mictv telugu

తాజ్‌మహల్‌ను షాజహాన్ కట్టించలేదు.. సుప్రీం కోర్టులో దావా

October 1, 2022

ఆగ్రాలోని అందాల పాలరాతి సౌధం తాజ్‌మహల్ మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ఆ సమాధిని అందరూ అనుకుంటున్నట్లు మొగల్ చక్రవర్తి షాజహాన్ కట్టించలేదంటూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ‘దాన్ని షాజహాన్ కట్టించడానికి చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దాని పుట్టుపూర్వోత్తరాలను శోధించి బయటపెట్టాలి. దీని కోసం రాజ్యంగబద్ధ కమిటీని నియమించాలి. విదేశీ దురాక్రమణదారులు నిర్మించిన వాటిని చారిత్రక కట్టడాలుగా ప్రకటించడం సమంజసం కాదు,’ అని డాక్టర్ రజనీష్ సింగ్ అనే వ్యక్తి సర్వోన్నత న్యాయస్థానం గడప తొక్కారు. ఈ వాదనతోనే అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఆ కోర్టు కొట్టేయడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

తాజ్‌మహల్‌ను ఎవరు కట్టారంటూ పిటిషనర్ గతంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్‌ను సమాచార హక్కు కింద వివరాలు అడిగారు. అందుకు ఆ సంస్థ సరైన సమాధానాలు ఇవ్వలేకపోయింది. షాజహాన్ తన భార్య సమాధిగా తాజ్‌మహల్‌ను నిర్మించినట్లు చెప్పే ఆధారాలు లేవని పేర్కొంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ కూడా తన ప్రశ్నలకు సమాధానం చెప్పే స్థితిలో లేదంటూ ఆయన కోర్టుకెక్కారు. తాజ్‌మహల్‌ నిర్మాణం 1653లో పూర్తయిందని ప్రచారంలో మాత్రమే ఉందని, అందుకు ఆధారాలు లేవనని ఆయన వాదిస్తున్నారు. తాజ్ మహల్ తేజో మహాలయం అనే శివాలయమని, దానికింద హిందూ కట్టడాలు ఉన్నాయంటూ ఇదివరకు కూడా పిటిషన్లు దాఖలు కావడం, ఆ సమాధిలో అలాంటివేమీ లేవని ఏఎస్ఐ చెబుతుండడం తెలిసిందే.