డిగ్రీ పూర్తికాగానే పీహెచ్‌డీ.. పీజీ ఏడాదే.. - MicTv.in - Telugu News
mictv telugu

డిగ్రీ పూర్తికాగానే పీహెచ్‌డీ.. పీజీ ఏడాదే..

September 29, 2020

Take action against colleges ignoring quality standards: CM Jagan Mohan Reddy tells officials

నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసినవారికి నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశం కల్పించాలని ఏపీ ప్రభుత్వం  నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీచేశారు. ఉన్నత విద్యా రంగానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో కొత్త జాతీయ విద్యా విధానం-2020 అమలులో భాగంగా ఉన్నత విద్యపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఇకపై రాష్ట్రంలో ఏడాది లేదా రెండేళ్ల పీజీ ప్రోగ్రాములు ఉండాలని అధికారులకు జగన్ సూచించారు. మూడు లేదా నాలుగేళ్ల డిగ్రీ కోర్సులను ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని అన్నారు. నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసినవారికి నేరుగా పీహెచ్‌డీలో అడ్మిషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. వచ్చే ఏడాది నుంచి అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఈడీ ప్రోగ్రాములు ఉండాలని స్పష్టంచేశారు. మరోవైపు కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్ష్యాలు నిర్దేశించింది. 

రాష్ట్రంలోని అన్ని కళాశాలలు వచ్చే మూడేళ్లలో ఎన్‌బీఏ (నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ కౌన్సిల్), ఎన్ఏసీ-న్యాక్‌ (నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్) సర్టిఫికెట్లు సాధించాలని జగన్ వివరించారు. ప్రమాణాలు లేని ఇంజనీరింగ్ కాలేజీలతో సహా అన్ని కళాశాలలకు నోటీసులు అందించాలని.. మూడేళ్లలో మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకనుంచి బీఈడీ కాలేజీలు కచ్చితంగా ప్రమాణాలు పాటించాలని అన్నారు. అలాగే ఉన్నత విద్యలో అడ్వాన్స్‌డ్ టాపిక్‌లతో కోర్సులు ప్రవేశపెట్టడంపై.. రొబోటిక్స్, ఏఐ, డేటా అనలటిక్స్ వంటి కోర్సులు ప్రారంభించాలని జగన్ పేర్కొన్నారు. సెక్యూరిటీ (స్టాక్‌) అనాలిసిస్‌, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలు  బీకాంలో ఉండాలని అన్నారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ రీసెర్చి ఓరియెంటేషన్ ప్రధాన లక్ష్యంగా ఈ విద్యా సంవత్సరం నుంచే నాలుగేళ్ల హానర్స్ డిగ్రీ కోర్సును మొదలుపెడుతున్నామని అధికారులు వెల్లడించారు.