Take action if Bathukamma sarees are burnt, Minister Errabelli comments
mictv telugu

బతుకమ్మ, రైతుబంధు పథకానికి ముడిపెడుతూ మంత్రి ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు

September 23, 2022

బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న చీరలను ఎవరైనా తగలబెడితే కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బతుకమ్మ పండుగ సంబరాలపై, దసరా ఉత్సవాలపై వరంగల్ జిల్లా అధికారులతో.. మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి అక్కచెల్లమ్మలకు ఒక అన్నగా, తమ్ముడుగా ఎంతో ప్రేమతో బతుకమ్మ చీరలు ఇస్తున్నారని దానిని కొందరు రాజకీయం చేసి వాటిని కాల్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇది చాలా బాధకరమైన విషయమని అన్నారు.

బతుకమ్మ చీరలు నచ్చితే తీసుకోవాలి లేకుంటే వదిలివేయాలని అంతే గాని లేనిపోని రాజకీయం చేయడం తగదని ఆయన హెచ్చరించారు. బతుకమ్మ చీరలు ఇష్టం లేని వాళ్ళు తీసుకోవద్దని, అలాగే వారి ఇంట్లో తీసుకుంటున్న ఫించన్లు, రైతుబంధు మిగతా ఇతర ప్రభుత్వ పథకాలు కూడా తీసుకోకూడదు అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు.

గత సంవత్సరం వరంగల్ పరిధిలో ఆరు చోట్ల ఉత్సవాల నిర్వహణలో కొన్ని లోపాలు కనిపించాయని, ఈ దఫా ఎటువంటి లోపాలు కనిపించకుండా చూడాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ప్రభుత్వం ఈ చీరల పంపిణీ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమైంది. కోటి మందికి పైగా లబ్ధిదారులకు చీరలను పంపిణీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసిన ప్రభుత్వం పంపిణీ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.