పోలవరం పనులు త్వరగా చేపట్టండి.. ప్రభుత్వాన్ని కోరిన పీపీఏ - MicTv.in - Telugu News
mictv telugu

పోలవరం పనులు త్వరగా చేపట్టండి.. ప్రభుత్వాన్ని కోరిన పీపీఏ

October 21, 2019

Polavaram .

పోలవరం ప్రాజెక్ట్ పనులను త్వరగా చేపట్టాలని పీపీఏ (పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ) ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. పునరావాస పనులను అత్యంత ప్రాధాన్యంగా చేపట్టాలని.. 2020 మే నెలాఖరుకే పూర్తి చేయాలని సూచించింది. హైదరాబాద్‌లోని కేంద్ర జలవనరుల సంఘం కార్యాలయంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పనుల పురోగతి, రివర్స్‌ టెండరింగ్‌ తదితర అంశాలపై సమీక్షించారు. 

ప్రాజెక్ట్‌ నిర్మాణం ఆలస్యమైతే ప్రయోజనాలు మరింత ఆలస్యం అవుతాయని అభిప్రాయపడింది. సమావేశంలో పాల్గొన్న బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండే మాట్లాడుతూ.. ‘రివర్స్‌ టెండరింగ్‌ తర్వాత హెడ్ వర్క్స్ పనుల తీరుపై సమావేశంలో చర్చించాం. హైకోర్టు స్టే ఉన్నందున పనులను అప్పగించలేమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీఏకి వివరించింది. ఈ క్రమంలో స్టే ఎత్తివేతకు ప్రయత్నిస్తున్నాం. వీలైనంత త్వరగా పనులు అప్పగిస్తామని ఏపీ అధికారులు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్‌ డంపింగ్ వల్ల పర్యావరణం దెబ్బతింటుందన్న పిటిషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇచ్చిన నివేదికను జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు నివేదిస్తాం’ అని పాండే తెలిపారు. 

ఇదిలావుండగా పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు త్వరగా వచ్చేలా చూడాలని ప్రాజెక్టు అథారిటీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. ఈ సమావేశం అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్కే జైన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ సహా ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.