14 వేల సినీ-టీవీ కార్మికులకు తలసాని సాయం
లాక్‌డౌన్ కారణంగా సినిమా, టీవీ సీరియళ్ల షూటింగులు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో ఆ రంగాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న సినీ, టీవీ కార్మికుల పరిస్థితి దిక్కు తోచకుండా అయిపోయింది. ఈ క్రమంలో టాలీవుడ్ పెద్దలు వారికి సాయం చేస్తున్నారు. నిత్యావసరాలు అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో అలాంటి వారికి సాయం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఆయన తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల కుటుంబాలకు తలసాని ట్రస్ట్ ద్వారా నిత్యావసరాలు అందించారు. ఈ కార్యక్రమాన్ని గురువారం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో ప్రాంరంభించారు.
ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు అక్కినేని నాగార్జున, దర్శకుడు ఎన్. శంకర్, కాదంబరి కిరణ్, ఎస్.ఎస్.రాజమౌళి, త్రివిక్రమ్, దిల్‌రాజు, కొరటాల శివ, రాధాకృష్ణ, రామ్మోహనరావు, తలసాని సాయి, సి.కల్యాణ్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా పలువురు సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు అందించారు.