పొరుగు దేశం పాకిస్తాన్ లో తాలిబన్లు రెచ్చిపోయారు. వాయవ్య ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని ఓ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో 9 మంది ఉగ్రవాద వ్యతిరేక పోరాట దళ సభ్యులను బందీలుగా పట్టుకున్నారు. అనంతరం వారితో ఉన్న వీడియోను రిలీజ్ చేసి.. జైళ్లలో ఉన్నతమవారికి విడదుల చేయాలని, తాము క్షేమంగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లేందుకు హెలికాప్టర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆఫ్ఘాన్ సరిహద్దుల్లోని వజీరిస్థాన్ లోని లక్కీ మార్వాట్ పోలీస్ స్టేషనుపై దాడి చేసి నలుగురు సిబ్బందిని చంపేశారు. వీడియో రిలీజ్ అవడంతో స్పందించిన పాక్ ఆర్మీ.. 17 గంటల నుంచి ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఇరు వర్గాలకు జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు మరణించారు. అయితే ఈ తాలిబన్లు ఆఫ్షాన్ వారు కాదని పాకిస్తాన్ లోనే ఉన్న తెహ్రీక్ ఏ తాలిబన్ గ్రూపుకు చెందిన వారని తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రావిన్స్ ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ షరీఫ్ మాట్లాడుతూ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని తెలిపారు.
కాగా, పాకిస్తాన్ లో తెహ్రీక్ ఏ తాలిబన్ సంస్థ ఆ దేశంలో షరియా చట్టాలను అమలు చేయాలనే డిమాండుతో దాడులకు తెగబడుతోంది. పాక్ ప్రభుత్వం వారితో శాంతి ఒప్పందం చేసుకోగా, ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నట్టు ఇటీవలే ఆ సంస్థ చెప్పడంతో పాక్ భద్రతా బలగాలపై దాడులు పెరిగాయి. అటు ఆఫ్ఘాన్ తాలిబన్లు డ్యూరాండ్ రేఖను సరిహద్దుగా గుర్తించడానికి నిరాకరిస్తున్నాయి. పఠాన్ల జనాభా ఎక్కువగా ఉండే ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్సులోని మెజారిటీ భాగం తమ దేశానికి చెందుతుందని వాదిస్తోంది. ఈ క్రమంలో సరిహద్దు వద్ద నిత్యం ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో వాటిని కంట్రోల్ చేయలేక పాకిస్తాన్ సతమతమవుతోంది.