అఫ్గానిస్థాన్లో అధికారం చేపట్టిన నాటి నుంచి తాలిబన్లు మహిళలపై ఆంక్షలు విధిస్తూనే వస్తున్నారు. ఆక్రమణ అనంతరం పలు నిబంధనలతో అనేక మంది బాలికలు చదువుకు దూరమవగా.. వారిని ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా మరోసారి ఇలాంటి పనే చేసింది. మహిళా ఉద్యోగులను ఆఫీసుకు రావద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా సమీప బంధువుల్లోని మగాళ్లను పంపాలని ఆదేశించింది. ఈ మేరకు ఓ మహిళా ఉద్యోగి వెల్లడించారు.
బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ చేసి ఉన్నత స్థాయిలో ఉన్న ఆ మహిళ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఆఫీస్లో పని భారం పెరుగుతోందని, మహిళలకు అది సాధ్యం కానుందున.. మీ స్థానంలో మీకు తెలిసిన పురుషుడ్ని పంపాలన్నారు. తాలిబన్ అధికారుల నుంచి వచ్చిన ఫోన్ కాల్ ద్వారా ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత తమ పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయిందన్నారు. ఉన్న పదవిని కూడా తగ్గించి.. రూ.60 వేలు ఉన్న నా జీతాన్ని 12 వేలు చేశారన్నారు. ఇదేంటని ప్రశ్నించినందుకు పై అధికారి దురుసుగా ప్రవర్తించారన్నారు. ఎక్కువగా మాట్లాడితే ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిపోమన్నారని, ఉద్యోగం ఉండాలనుకుంటే ఇకపై విషయం గురించి చర్చించవద్దని వార్నింగ్ ఇచ్చారన్నారు. జీతం తగ్గాక తన కొడుకు స్కూల్ ఫీజు కూడా కట్టలేని దుస్థితి వచ్చిందని బావురుమన్నారు.