ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పరిధిలోని వికృతమాలలో ఎలక్ట్రానిక్ మాన్యు ఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ) మూడు ప్రాజెక్టులకు జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు స్థాపిస్తున్న పారిశ్రామిక వేత్తలకు జగన్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..”మీకు మాటిస్తున్నా, మీ వెంటే ఉంటా. ఒక్క ఫోన్ కాల్ చేయండి. సమస్య ఎంతటిదైనా పరిష్కరిస్తాం. ఎప్పుడు, ఎక్కడ ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ ద్వారా నాతో పంచుకోవచ్చు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల ప్రయాణం అత్యద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా. టీసీఎల్ సంస్థ ద్వారా రూ.1,230 కోట్ల పెట్టుబడితో టీవీ ప్యానల్స్, మొబైల్ డిస్ప్లే యూనిట్లు తయారు చేసే మంచి వ్యవస్థకు తిరుపతి కేంద్రం కావటం శుభ పరిణామం. దీని ద్వారా దాదాపు 3,200 మందికి ఉపాధి కలిగింది. అది ఈరోజు నుండే శ్రీకారం చుట్టడం అభినందనీయం” అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమానికి ఏర్పేడు, ఇనగలూరులో పారిశ్రామికవేత్తలు, శ్రీకాళహస్తి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు భారీ ఎత్తున విచ్చేశారు. అనంతరం అనంతరం సీఎం వైఎస్ జగన్ ప్రజల నుంచి అభ్యర్థనలు, వినతి పత్రాలు స్వీకరించారు. ఆ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు.