Talks between the teachers' unions and the minister bothsa is failed
mictv telugu

యాప్ వివాదం.. మంత్రి బొత్సతో ఉపాధ్యాయ సంఘాల చర్చలు విఫలం

August 18, 2022

ఏపీ ప్రభుత్వం టీచర్లకు తప్పనిసరి చేసిన ఫేస్ రికగ్నేషన్ యాప్ పట్ల ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకు ముందు విద్యాశాఖ కమిషనర్‌తో జరిపిన చర్చలు విఫలం కావడంతో నేరుగా మంత్రి బొత్స రంగంలోకి దిగారు. యాప్ డౌన్‌లోడ్ చేయడం ఒక ప్రహసనమైతే, అందులో లాగిన్ కావడం, నిత్యం ఫోటోలు అప్‌లోడ్ చేయడం మరో ప్రహసనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశాయి. చర్చల సందర్భంగా సొంత ఫోన్లలో యాప్ డౌన్‌లోడ్ చేయలేమని, ప్రభుత్వం ఫోన్లు ఇస్తే అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. పాఠశాలలోనే మౌఖిక హాజరు పరికరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తర్వాత బొత్స మాట్లాడుతూ.. యాప్ వివాదంలో కొంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని, యాప్ వాడకంలో అందరికీ 15 రోజుల శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే లక్ష మంది యాప్ వాడుతున్నారని, తొందర్లోనే మిగతా 50 శాతం మంది ఉపాధ్యాయులు డౌన్‌లోడ్ చేసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి ఉద్దేశంతో ముందుకుపోతున్నానమని, అర్ధం చేసుకోవాలని కోరారు. అయితే హాజరు, ఆలస్యం విషయంలో పాత నిబంధనలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. సెల్‌ఫోన్లు సొంతవి వాడాలా? లేక ప్రభుత్వం ఇవ్వాలా? అనేది ఆయా శాఖలే నిర్ణయం తీసుకుంటాయని వెల్లడించారు. త్వరలో అన్ని విభాగాల్లోనూ ఇదే పద్ధతి రావొచ్చని సూత్రప్రాయంగా తెలియజేశారు.