ఆర్టీసీ ఆస్తుల విభజనపై ఉమ్మడి ఆర్టీసీ బోర్డు గురువారం విజయవాడలోని ఆర్టీసీ హౌస్ లో సమావేశమైంది. ఆస్తుల పంపకాలు, ఉద్యోగుల విభజనపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఉద్యోగుల విభజనపై ఇరు పక్షాల మధ్య అంగీకారం కుదిరింది. దంపతులైన ఉద్యోగుల విషయంలో పరస్పర బదిలీల ప్రతిపాదనకు కూడా పచ్చాజెండా ఊపారు. కొత్త రాష్ట్రంలో పలు వ్యవస్థాగత మార్పులను చేపట్టామని, ఆస్తుల విభజనకు మరికొంత సమయం కావాలని తెలంగాణ అర్టీసీ అధికారులు సమావేశంలో కోరారు. దీంతో తదుపరి సమావేశాన్ని సెప్టెంబర్ 15న నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఆర్టీసీ నుంచి ఐదుగురు అధికారులు, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ నుంచి ఏడుగురు అధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏఎస్ఆర్టీయూ ఈడీ ఆనందరావు, సీఐఆర్టీ డైరెక్టర్ రాజేంద్ర పాటిల్ కూడా పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన చట్టం ప్రకారం షెడ్యూల్డ్ 9, 10లోని సంస్థల ఆస్తుల పంపిణీ, సిబ్బంది విభజన కోసం కేంద్రం షీలాబిడే కమిటీని నియమించింది. మూడేళ్లుగా కమిటీ ఆర్టీసీ యాజమాన్యాలతో చర్చించినా కొలిక్కి రావడంలేదు. దీంతో గత ఏడాది కేంద్రం బోర్డును ఏర్పాటు చేసింది. దీనిలో జనాభా నిష్పత్తి 58: 42 ప్రకారం పంచుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యం, గుర్తింపు యూనియన్ ఎన్ఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య పట్టుబట్టారు. అయితే ఎక్కడి ఆస్తులు అక్కడే అన్న డిమాండ్ టీఎస్ ఆర్టీసీ నుంచి వచ్చింది. ఇప్పటికీ ప్రతి మీటింగ్‌లోనూ అదే వాదన వినిపిస్తుండడంతో ఈ నెల 2న హైదరాబాద్‌లో సమావేశమైనప్పుడు తెలంగాణ నుంచి ఎక్కడి ఆస్తులు అక్కడే అన్న వాదన మరోసారి తెరపైకి వచ్చింది. దీంతో షీలాబిడే కమిటీ ఎటూ తేల్చలేదు.