తమిళ దర్శకులకు మొట్టికాయలు.. రాజమౌళియే కారణమా? - MicTv.in - Telugu News
mictv telugu

తమిళ దర్శకులకు మొట్టికాయలు.. రాజమౌళియే కారణమా?

March 26, 2022

rajamouli

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ దర్శకుడు రాజమౌళి తీస్తున్న సినిమాలు, సాధిస్తున్న విజయాలు, మల్టీస్టారర్, భారీ బడ్జెట్, మార్కెట్ స్ట్రాటజీ వంటివి అన్ని భాషల పరిశ్రమలకు ఓ పెద్ద బాలశిక్షలాంటివి. మిగతా పరిశ్రమల దర్శకులకు అందనంత ఎత్తుకు ఆయన ఎదుగుతున్న తీరు సినిమా పరిశ్రమకు గర్వకారణం. అయితే రాజమౌళి వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రాజమౌళిలాగా మీరెందుకు సినిమాలు తీయలేకపోతున్నారు? అంటూ ఇతర భాషల దర్శకులను ప్రేక్షకులు నిలదీస్తున్నారు. తమిళనాడులో కోలీవుడ్ దర్శకులను అక్కడి ప్రేక్షకులు ఇలానే అడుగుతున్నారు. ఇద్దరు బడా హీరోలతో మల్టీస్టారర్ కానీ, అంత పెద్ద కథలతో సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. మంచి నటీనటులు, సాంకేతికంగా అన్ని వసతులూ ఉన్నప్పటికీ ఎందుకు వాడుకోవట్లేదని మండిపడుతున్నారు. అంతేకాదు, రాజమౌళిని చూసి నేర్చుకోండని సలహా ఇస్తున్నారు. బాహుబలి నుంచి పాన్ ఇండియా సినిమాల జోరు పెరిగిందనీ, తమిళ చిత్రాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడానికి ఇదే తగిన సమయమని వారు సూచిస్తున్నారు. రాజమౌళి రేంజ్ సినిమాలు కాకపోయినా, అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ తీసి జాతీయ స్థాయిలో భారీ కలెక్షన్లు రాబట్టిన సుకుమార్ వంటి దర్శకుల స్థాయిలోనైనా సినిమాలు తీయండని దెప్పిపొడుస్తున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ డైరెక్టర్లు సతమతమవుతున్నారు.