తమిళ హాస్యనటుడు రోబో శంకర్‌కు తుప్పు వదిలింది. ‘హోమ్ టూర్’ పేరుతో చేసిన వీడియో కాస్తా అటవీ శాఖ అధికారుల కంటపడి భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. ’పులి’, ‘యుముడు’ వంటి డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన శంకర్.. చెన్నైలోని తన ఇంట్లో అలెగ్జాండ్రైన్ పారకీట్ జాతికి చెందిన చిలుకలను పెంచుకుంటున్నాడు. ఇటీవల హోమ్ టూర్ అంటూ తన ఇంటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టాడు. అందులో చిలుకలు కనిపించడంతో ఎవరో అధికారులకు ఉప్పందించారు. అధికారులు అతని ఇంటిపై దాడి చేసి రెండు చిలుకలను జప్తు చేశారు. దాడి సమయంలో శంకర్ విదేశాల్లో ఉన్నాడు. అతడు చెన్నై చేరుకుని, తను నిర్దోషినని చెప్పాడు.
‘‘ఆ చిలకలను మూడేళ్ల కిందట నా ఫ్రెండ్ ఇచ్చారు. వాటిని పెంచుకోవడానికి అనుమతి తీసుకోవాలని నాకు తెలియదు’’ అని చెప్పాడు. దీంతో అధికారులు అతనికి రూ. 2.5 లక్షల జరిమానా విధించి వదిలేశారు. మనదేశంలో కొన్ని జాతుల చిలుకలను పెంచుకోవాలంటే అనుమతులు తప్పనిసరి. విదేశీ పక్షులు, జంతువులను నుంచి జబ్బులు వ్యాపించే అవకాశముందని చాలా దేశాలు వాటిపై నిషేధం విధిస్తుంటాయి. అయితే కొన్ని షరతులతో వాటిని పెంచుకోవడానికి అంగీకరిస్తుంటాయి. అలెగ్జాండ్రైన్ పారకీట్ మనదేశపు పక్షే అయినా అంతరించిపోవడానికి దగ్గరున్న జాతుల్లో దీన్ని చేర్చారు.