నిర్భయ దోషులను ఉరి తీస్తా..తమిళనాడు కానిస్టేబుల్ - MicTv.in - Telugu News
mictv telugu

నిర్భయ దోషులను ఉరి తీస్తా..తమిళనాడు కానిస్టేబుల్

December 10, 2019

Tamil Cop01

నిర్భయ కేసులో నలుగురు దోషులకు త్వరలోనే ఉరి శిక్ష అమలు చేసేందుకు తీహార్‌ జైలు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. వారిని ఉరి తీయడానికి తలారి అందుబాటులో లేడంటూ అప్పట్లో అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఓ పోలీసు హెడ్‌ కానిస్టేబుల్‌ ఆ పని కోసం తనను నియమించాలని కోరుతున్నారు. ఈ విషయంపై తీహార్‌ జైలు డీజీపీకి సుభాష్‌ శ్రీనివాసన్‌ అనే కానిస్టేబుల్ లేఖ రాశారు. నిర్భయ దోషులను ఉరితీసే అవకాశం తనకు ఇవ్వాలని, ఈ పని కోసం డబ్బులు కూడా తీసుకోనని లేఖలో పేర్కొన్నాడు. ఆ పని ఎంతో గొప్పది కాబట్టి తనకు అక్కడ పనిచేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరాడు.

దేశ రాజధాని ఢిల్లీలో 2012లో నిర్బయ అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘోరం జరిగి ఏడేళ్లు కావస్తున్నా ఇంకా దోషులకు ఉరి శిక్ష విధించలేదు. దీనిపై ప్రజలు పలు మార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ హత్యాచారం జరిగినప్పుడు కూడా నిర్భయ అంశం చర్చనీయాంశం అయింది. నిర్భయ తల్లి కూడా తమకు ఇంకా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న నిందితులను ఉరితీయడానికి తలారి లేడని ఇటీవల అధికార వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈనెల 16న ఉదయం 5గంటలకు నిర్భయ దోషులను ఉరి తీయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిర్భయ అత్యాచారం జరిగిన డిసెంబర్ 16వ తేదీనే వీరిని ఉరి తీస్తారని సమాచారం. 

ఈ వార్తలకు బలం చేకూర్చేలా బిహార్‌లోని బక్సార్ సెంట్రల్ జైల్లో కొంత మంది ఖైదీలు ఉరితాళ్లను సిద్ధం చేస్తున్నారు. వీళ్ళు నిర్బయ దోషులను ఉరితీయడానికి తాళ్లను తయారుచేసే పనిలో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బక్సార్ జైలు సూపరింటిండెంట్ విజయ్ కుమార్ ఆరోరా మాట్లాడుతూ..’10 ఉరితాళ్లను సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. వీటిని ఎక్కడకు పంపుతారో నాకు తెలియదు. మేము వాటిని సిద్ధం చేస్తున్నాం’ అని తెలిపారు. మూడు రోజుల కిందటే బక్సార్ జైలు అధికారులకు ఆదేశాలు అందాయి. కేంద్ర హోం శాఖ పంపిన నిర్భయ నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించిన తర్వాతే తమకు ఆదేశాలు వచ్చాయని ఓ అధికారి తెలిపారు.