శ్రీలంకలో తమిళుల కోసం ప్రత్యేక దేశం కావాలని సాయుధ పోరాటం చేసిన ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ బతికే ఉన్నారంటూ ప్రపంచ తమిళ సంఘం అధ్యక్షుడు పజా నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. ప్రభాకరన్ కుటుంబంతో తాను టచ్‌లో ఉన్నానని, వారి అభీష్టం మేరకే తాను ఈ విషయం వెల్లడిస్తున్నానని తెలిపారు. సోమవారం తంజావూరులో మీడియాతో మాట్లాడిన నెడుమారన్ ‘తమిళులకు ఈ శుభవార్త చెప్తున్నందుకు గర్వంగా ఉంది. వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారు. మంచి ఆరోగ్యంతో ఉన్నారు. ప్రజల కోసం తొందర్లో ఆయన బయటికి వస్తారు. ఆయన విషయంలో వచ్చిన పుకార్లన్నింటికీ తెర పడుతుందని ఆశిస్తున్నా. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితి, శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు వంటివి ప్రభాకరన్ ప్రజల ముందుకు వచ్చేందుకు దోహదం చేస్తున్నాయి. తమిళ ఈలం కోసం ఆయన త్వరలో తన ప్లాన్ ప్రకటించనున్నారు’ అని వెల్లడించారు. కాగా, శ్రీలంకలో 2009లో జరిగిన అంతర్యుద్ధంలో లంక సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో ప్రభాకరన్ చనిపోయాడని అధికారికంగా ఆ దేశం ప్రకటించింది. డీఎన్ఏ పరీక్షలు సైతం చేసి అందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. ప్రభాకరన్ కుమారుడిని కూడా అప్పుడు సైన్యం చంపేసింది. ఈ నేపథ్యంలో నెడుమారన్ ప్రకటన సంచలనంగా మారింది. అటు ప్రపంచంలో ఏ సంస్థకు లేని ఘనత ఎల్టీటీఈ దక్కించుకుంది. అప్పట్లో వాయు, జల, పదాతి దళాలను కలిగిన ఏకైక పోరాట సంస్థగా పేరు గాంచింది.