ఘోరం.. బతికుండగానే ఫ్రీజర్‌లో పెట్టి, కదలడంతో..  - MicTv.in - Telugu News
mictv telugu

ఘోరం.. బతికుండగానే ఫ్రీజర్‌లో పెట్టి, కదలడంతో.. 

October 16, 2020

Tamil Nadu: 74 Years Old Man Kept in Freezer Box by Relatives Overnight, Rescued Alive by Police

తమిళనాడులో ఘోరం జరిగింది. బతికి ఉండగానే ఓ వృద్ధుడిని ఫ్రీజర్‌లో పెట్టారు. దీంతో ఒక రోజంతా ఆయన ఫ్రీజర్‌లోనే ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆయనను బతికించాలని వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇవాళ ఆయన మృతిచెందారు. సేలం కందపట్టి హౌసింగ్‌ బోర్డుకు చెందిన బాలసుబ్రమణ్య కుమార్‌ (70) ఉద్యోగం నుంచి విరమణ పొందారు. ఆయనకు పిల్లలు కలగకపోవడంతో భార్యాభర్తలు ఇద్దరే ఉండేవారు. గత ఏడాది ఆయన భార్య చనిపోయారు. దీంతో బాలసుబ్రమణ్య కుమార్ తన సోదరుడు శరవణన్, ఇతర బంధువులతో కలిసి హౌసింగ్‌ బోర్డులో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో, కొన్ని రోజుల క్రితం ఆ పెద్దాయన అనారోగ్యానికి లోనయ్యారు. దీంతో ఆయనను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో, ఆయన బతికే అవకాశం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో ఆయనను మంగళవారం ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. 

కాసేపటికి బాలసుబ్రమణ్య కుమార్‌ చలనం లేకుండా పడిపోవడంతో, తన అన్నయ్య చనిపోయాడని భావించిన శరవణన్, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. ఫ్రీజర్‌ బాక్స్‌ను ఇంటికి తెప్పించి, బాలసుబ్రమణ్య కుమార్‌ కాళ్లు, చేతుల కట్టి మృతదేహంలా చుట్టి అందులో పడుకోబెట్టాడు. అయితే ఆయన చనిపోలేదని.. శరీరం చచ్చుబడ్డా, హృదయ స్పందన ఆగిపోలేదని శరవణన్‌కు తెలుసు. అన్న గుండె ఎప్పుడు ఆగుతుందా అని రాత్రంతా ఎదురు చూశాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయాన్నే ఫ్రీజర్‌ బాక్స్‌ అద్దెకు ఇచ్చిన వ్యక్తి, శరవణన్‌ ఇంటికి వచ్చాడు. బాలసుబ్రమణ్య కుమార్‌ శరీరంలో చలనం చూసి షాక్ అయ్యాడు అతడు. కళ్లు తెరచుకుని ఊపిరి పీల్చలేని స్థితిలో ఉండటాన్ని గమనించి ఆందోళన చెందాడు. ఈ విషయం గురించి శరవణన్‌కు చెప్పినప్పటికీ అతను పట్టించుకోలేదు. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్రీజర్‌ బాక్స్‌లో ఉన్న బాలసుబ్రమణ్యంను బయటకు తీసి, అంబులెన్స్‌లో  ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన నేడు(శుక్రవారం) మృతిచెందారు. కాగా, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆయన, మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.