భారత్ – శ్రీలంక మధ్య ఉన్న రామసేతు అని పిలవబడే సేతు సముద్రం ప్రాజెక్టుపై గురువారం తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది డీఎంకే ప్రభుత్వం. దీనికి బీజేపీ సహా అన్ని పక్షాలు మద్ధతు తెలిపాయి. దేశానికి పశ్చిమాన ఉన్న అరేబియా సముద్ర తీరం నుంచి తూర్పు తీరాన్ని చేరుకోవడానికి ఇది దగ్గరి దారి అని అభిప్రాయపడింది. ఇప్పటివరకు శ్రీలంక చుట్టూ చుట్టి రావాల్సి ఉండగా, సేతు సముద్రం ప్రాజెక్టుతో ఆ భారం తప్పనుందని స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టును కొనసాగించమని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మానం చేశారు. రెండు దేశాల మధ్య ఉన్న ఈ బ్రిడ్జీని త్రేతాయుగంలో రాముడు నిర్మించాడని హిందువుల ప్రగాఢ విశ్వాసం.
అయితే 1860లోనే బ్రిటీష్ పాలకులు దీని గురించి ప్రస్తావించినా కార్యరూపం దాల్చలేదు. తర్వాత భారత ప్రభుత్వం ప్రయత్నించినా మతపరమైన అడ్డంకులు వచ్చాయి. ఈ మార్గంలో భారీ నౌకలు ప్రయాణించాలంటే సముద్రాన్ని లోతుగా తవ్వాల్సి ఉంటుంది. దీంతో రామసేతు దెబ్బతింటుందని తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అటు రామసేతుకు ఎలాంటి నష్టం జరగకుండా సేతు సముద్రం ప్రాజెక్టు చేపట్టాలని తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే నయనార్ నాగేంద్రన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో అత్యధికంగా సంతోషించేది తామేనని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ ప్రాజెక్టు మరోసారి చర్చనీయాంశం అయింది. కాగా, ఇటీవలే అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో రామసేతుపై ఓ సినిమా రూపిందిన విషయం పాఠకులకు తెలిసిందే.