తమిళనాడు పాలిటిక్స్ అంతు లేకుండా సాగుతూనే ఉన్నాయి. అనంతకోటి రాగాలు ఆలపిస్తూనే ఉన్నాయి. అమ్మ మరణం తర్వాత అన్నాడిఎంకే రాజకీయాలు పూర్తి స్థాయి అస్తిరతలోకి వెళ్లాయి. పన్నీర్ సెల్వం పదవికి చిన్నమ్మ ఎసరు పెట్టిన తర్వాత అస్సలు స్టోరీ స్టార్ట్ అయింది. ఆ తర్వాత పన్నీర్ దిగి పోయారు. రెండాకుల గుర్తు పార్టీ రెండు శిబిరాలుగా చీలి పోయింది. గోల్డెన్ బే రిసాట్ కేంద్రంగా బేర సారాలు… రహస్య మంతనాలు, ఎంఎల్యేల బంధనాలు అన్నీ చకచకా జరిగిపోయాయి.
ఆ తర్వాత అమ్మ సమాధి వద్ద పన్నీర్ ఓ వైపు, చిన్నమ్మ వర్గాలు ఇంకో వైపు శపథాలు చేసుకున్నారు. ఆరునూరైనా అధికారం మాదంటే మాదని చెప్పుకున్నారు. అదృష్టం అస్సలు బాగా లేక చిన్నమ్మ అక్రమస్తుల కేసు బెంచి మీదకొచ్చింది. సీఎం కుర్సీలో కూర్చోవడానికి అడుగు దూరంలో ఉండగనే పరప్పన అగ్రహారం జైలు రా రమ్మని చిన్నమ్మను ఆహ్వానించింది. ఆ తర్వాత స్టోరీని మరింత మలుపు తిప్పేందకు దినకరన్ రూపంలో ఎంట్రీ ఇచ్చింది మరో పాత్ర. పార్టీ గుర్తు తాము కైవసం చేసుకునేందుకు చిన్నమ్మకు ఇబ్బంది లేకుండా చేసేందుకు లంచాలు ఇవ్వజూపారు దినకరన్. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఆయనా జైలుకు వెళ్లారు. ఆ తర్వాత బయటకొచ్చారు.
తాజాగా పన్నీర్, సిఎం పళనీ స్వామీలు ఇద్దరూ దోస్త్ మేరా దోస్త్ అని ఏక రాగం ఎత్తుకున్నారు. ఇంతలోనే మరో ట్వీస్ట్ అదీ దినకరన్ రూపంలోనే వచ్చింది. పళని స్వామి ప్రభుత్వానికి మద్దతునిస్తున్న 122 మందిలో నుండి 19 మందిని లాగేస్తానని చెప్పారు. అన్నంత పనీచేశారు. 19 మందిని వెంటనేసుకుని గవర్నర్ ను కలిశారు. అంతే పన్నీర్ కు, పళని స్వామీకి పే…….ద్ద సవాల్ విసిరారు. పళని స్వామీ ప్రభుత్వాన్ని పడగొడ్తానని హెచ్చరికలు పంపాడు.
ఇన్నాళ్లు సిఎం కుర్సీ కోసం ఎదురు చూస్తున్న స్టాలిన్ ఛాన్స్ కోసం కాచుకుని కూర్చుకున్నారు. మంచి అవకాశం వచ్చిందని ఎదురు చూస్తున్న ఆయనకు ఛాన్స్ మంచిదే అయినా అందుకోవడానికి బారెడు దూరంలో ఉన్నారు. దినకరన్ సహకరించినా, కాంగ్రెస్ పార్టీ కనుకరించినా కావాల్సిన మెజార్టీ ఆయనకు ఇంకా తక్కువ అవుతుంది. ఇప్పుడు డిఎంకేకు 89 మంది ఎంఎల్యేలున్నారు. ఒక వేళ ప్రభుత్వాన్ని పడగొడ్తే ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు. పైగా కొత్త పార్టీ తెరపైకి వస్తుందని, కబాలి రూపంలో రజినీ కాంత్, భారతీయుడు రూపంలో కమల్ హాసన్ కాచుకుని కూర్చుకున్నారు.