తమిళనాడులో ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య సాగుతున్న వివాదాలు దారుణమైన తిట్లకు దారి తీశాయి. అంబేద్కర్ పేరు పలకని గవర్నర్‌ను చెప్పుతో కొట్టాలని, అతణ్ని చంపడానికి ఉగ్రవాదిని పంపిస్తానని డీఎంకే సీనియర్ నేత శివాజీ కృష్ణమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలోని అంబేద్కర్ పేరును గవర్నర్ పలికి ఉంటే పూలగుత్తి పంపేవాడిని. ఆయన పలకలేదు. ఆయనను చెప్పుతో కొట్టే హక్కు నాకు లేదా? ఆయనకు అంబేద్కర్ పేరును చెప్పడానికి ఇష్టం లేకపోతే కశ్మీర్ కు వెళ్లిపోవాలి. చంపడానికి ఉగ్రవాదిని పంపిస్తా’’ అని శివాజీ అన్నారు.
ఇటీవల అసెంబ్లీలో గవర్నర్ ఆర్ ఎన్ రవి చేసిన ప్రసంగంలో అంబేద్కర్ పేరును, కొంతమంది ద్రావిడ నేతల పేర్లను ప్రస్తావించలేదని ఆరోపణలు ఉన్నాయి. సభలో దీనిపై సీఎం స్టాలిన్‌కు, రవికి మధ్య గొడవ జరిగింది. గవర్నర్ కోపంతో వాకౌట్ చేశారు. అప్పట్నుంచి డీఎంకే నేతలు ఆయనను దుమ్మెత్తిపోస్తున్నారు. బిహార్ నుంచి వచ్చి పానీపూరి అమ్ముకునేవారు తమిళనాడుకు వచ్చారని, వారికి ఆత్మగౌరవం ఉండదని తిడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కూడా మండిపడుతూ కేసులు పెడుతోంది.